JN.1 కేసులు ఎక్కడెక్కడ ఎన్నెన్ని..?
సాక్షి లైఫ్ : భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 1226 COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదయ్యాయని గురువారం ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) సమాచారం అందించింది.
ఈ డేటా ప్రకారం, 17 రాష్ట్రాలతోపాటు పలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో JN.1 కొత్త కేసులు వచ్చాయి. JN.1 సబ్-వేరియంట్‌కు సంబంధించిన కేసులు కర్ణాటకలో 234 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో189, మహారాష్ట్రలో170, కేరళలో 156, పశ్చిమ బెంగాల్ లో 96, గోవాలో 90, తమిళనాడులో 88, గుజరాత్ లో76 కేసులు గుర్తించారు. రాజస్థాన్‌లో 37, తెలంగాణ 32, ఛత్తీస్‌గఢ్ 25, ఢిల్లీ 16, ఉత్తరప్రదేశ్ 7, హర్యానా 5, ఒడిశా 3, ఉత్తరాఖండ్, నాగాలాండ్ ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య, JN.1 సబ్-వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని కోరింది కేంద్రం.
కరోనా మార్గదర్శకాలను సమర్థవంతంగా పాటించాలని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. కోవిడ్ కేసుల పెరుగుదలను ముందస్తుగా గుర్తించి, అందు కోసం అవసరమైన అన్నిరకాల సౌకర్యాలను ఏర్పాటుచేయాలని సూచించింది. అంతేకాదు జిల్లాల వారీ కేసులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు తమకు నివేదించాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోరింది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
