Fingers and Hands Swell : వేళ్లు, చేతుల వాపు ఎందుకొస్తుంది..? దీని వెనుక ఉన్న అనారోగ్య కారణాలివే..!
సాక్షి లైఫ్ : బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 ఇటీవల కరేబియన్ దేశాల పర్యటనలో ఉన్నప్పుడు ఆయన చేతులు, వేళ్లు ఉబ్బి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నెటిజన్లు వీటిని 'సాసేజ్ ఫింగర్స్' (Sausage fingers) అంటూ ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022లో రాజుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఈ సమస్య ఆయనలో కనిపిస్తూనే ఉంది. చేతులు, కాళ్లు, వేళ్లలో వాపు రావడం అనేది సర్వసాధారణమే అయినప్పటికీ.. ఇది ఎల్లప్పుడూ సాధారణ సమస్యే కాకపోవచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కూడా కావొచ్చు. వాపులకు దారితీసే సాధారణ కారణాలు, అవి ఎప్పుడు ప్రమాదకరంగా మారుతాయో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
సాధారణ కారణాలు..
వాతావరణంలో మార్పులు, శరీరంలో నీరు చేరడం, హార్మోన్ల అసమతుల్యత, గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోవడం వంటివి వాపులకు దారితీస్తాయని జనరల్ ఫిజీషియన్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
చలి వాతావరణం..
చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను కాపాడుకునేందుకు, లోపలి అవయవాలకు వేడిని అందించేందుకు చర్మం కింది రక్తనాళాలు ముడుచుకుపోతాయి. ఆ తర్వాత చలిలో నుంచి వెచ్చని ప్రదేశానికి వెళ్లినప్పుడు ఆ రక్తనాళాలు అకస్మాత్తుగా వ్యాకోచిస్తాయి. దీనివల్ల రక్తప్రసరణ ఒక్కసారిగా పెరిగి చేతులు, కాళ్లలో వాపు వస్తుంది. 'రేనాడ్స్ డిసీజ్' (Raynaud's Disease) ఉన్నవారిలో ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
చిల్‌బ్లెయిన్స్ (Chilblains)..
చలికాలంలో చర్మం కింది రక్తనాళాలు అసాధారణంగా ముడుచుకుపోవడం వల్ల వేళ్ల చివర్లు ఎర్రగా లేదా నీలం రంగులోకి మారి వాపు, నొప్పి, మంట వస్తాయి. చలి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువ మందిని బాధిస్తుంది.
మహిళల్లో ఈ సమస్య ఎక్కువే..
పురుషులతో పోలిస్తే మహిళల్లో 'ఫ్లూయిడ్ రిటెన్షన్' అంటే శరీరంలో ద్రవాలు నిలిచిపోవడం.. సమస్య ఎక్కువ. దీనికి హార్మోన్లే ప్రధాన కారణం. ముఖ్యంగా మహిళల్లో ఉత్పత్తి అయ్యే ప్రొజెస్టెరాన్ హార్మోన్ వల్ల నెలసరి రాకముందు కాలి చీలమండలు, పాదాల్లో వాపు కనిపిస్తుంది. అలాగే మెనోపాజ్ (menopause) దశలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల కూడా శరీరంలో నీరు, ద్రవాల సమతుల్యత దెబ్బతిని వాపులు వస్తాయి.
ఈ వాపులు ప్రమాదకరం ఎప్పుడంటే..?
రాత్రిళ్లు నిద్రపోయి ఉదయం లేచేసరికి సాధారణ వాపులు తగ్గిపోతాయి. కానీ వాపు దీర్ఘకాలం పాటు ఉంటే మాత్రం తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గుండె వైఫల్యం (Heart Failure)..
గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గినప్పుడు, సిరల్లో (Veins) ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రక్తంలోని ద్రవాలు కణజాలాల్లోకి లీక్ అయి చేతులు, కాళ్లు, పాదాల్లో నీరు చేరి వాపు వస్తుంది.
కిడ్నీ సమస్యలు (Kidney Disease)..
రక్తాన్ని ఫిల్టర్ చేసి వ్యర్థాలను, అదనపు నీటిని, సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపడం కిడ్నీల ప్రధాన విధి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు ఆ వ్యర్థాలు, ద్రవాలు శరీరంలోనే ఉండిపోయి తీవ్రమైన వాపులకు దారితీస్తాయి.
డీప్ వీన్ థ్రాంబోసిస్ (DVT)..
శరీరంలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. దీనివల్ల రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి కాలు లేదా చేతిలో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి, వాపు వస్తాయి. గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తుల్లోకి చేరితే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.
కింగ్ చార్లెస్ వేళ్ల వాపునకు కచ్చితమైన కారణం అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే, మీకు గానీ మీ ఇంట్లో వారికి గానీ చేతులు, కాళ్లలో వాపులు తరచుగా వస్తున్నా, విశ్రాంతి తీసుకున్నా తగ్గకపోయినా, నొప్పితో కూడి ఉన్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
