Energy Drinks : అలసటను పోగొట్టే అమృతమా.. లేక అనారోగ్యాల నిలయమా..?
సాక్షి లైఫ్ : ప్రజెంట్ జనరేషన్లో ఎనర్జీ డ్రింక్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రాత్రిళ్లు చదువుకునేటప్పుడు నిద్ర రాకుండా ఉండేందుకు కొందరు, జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు మరింత ఉత్సాహం కోసం మరికొందరు వీటిని తాగుతున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలు, తీయటి రుచితో వెంటనే శక్తిని ఇస్తాయని భ్రమపడేలా చేసే ఈ పానీయాలు వాస్తవానికి ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఎనర్జీ డ్రింక్స్‌లో ఏముంటాయి..?
సాధారణంగా వీటిలో ఆల్కహాల్ ఉండదు కానీ.. కెఫిన్, టారిన్ (Taurine), మోతాదుకు మించిన చక్కెర, ఇతర ఉద్దీపనలు (Stimulants) అత్యధికంగా ఉంటాయి. ఇవి మెదడును ప్రేరేపించి తాత్కాలికంగా అలసటను దూరం చేసి, చురుకుదనాన్ని పెంచినా.. దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.
శరీరంపై చూపే దుష్ప్రభావాలు..
గుండెకు చేటు..ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే అధిక కెఫిన్ నాడీ వ్యవస్థను అతిగా ఉత్తేజపరుస్తుంది. అవసరానికి మించి కెఫిన్ శరీరంలోకి చేరడం వల్ల గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా పెరుగుతుంది. బీపీ (Blood pressure) పెరగడం, గుండె లయ తప్పడం, ఆందోళన, ఛాతీలో అసౌకర్యం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి.
నిద్రకు శత్రువు.. తక్షణ శక్తి కోసం సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వీటిని తాగడం వల్ల నిద్రకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. నిద్రలేమి కారణంగా మరుసటి రోజు తీవ్రమైన అలసట, చికాకు, ఆందోళన పెరిగి పనితీరు మందగిస్తుంది.
మధుమేహం, ఊబకాయం ముప్పు..
కెఫిన్‌తో పాటు ఈ డ్రింక్స్‌లో చక్కెర మోతాదు ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. 'అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్' నివేదిక ప్రకారం.. సుమారు 400 ఎంఎల్ (ml) ఎనర్జీ డ్రింక్‌లో 54 నుంచి 62 గ్రాముల అదనపు చక్కెర ఉంటుంది. వాస్తవానికి ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 30 గ్రాములకు మించి చక్కెర తీసుకోకూడదు. అంటే, ఒక్క ఎనర్జీ డ్రింక్ తాగడం ద్వారానే రోజువారీ పరిమితికి రెట్టింపు చక్కెర శరీరంలోకి చేరుతుంది. దీనివల్ల ఊబకాయం, దంతాలు పాడవడం, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం అనూహ్యంగా పెరుగుతుంది.
పిల్లలకు మరింత ప్రమాదకరం..
పిల్లలు, కౌమారదశలో ఉన్నవారి (teenagers) శరీరం కెఫిన్‌కు త్వరగా ప్రభావితం అవుతుంది. కొద్దిపాటి కెఫిన్ కూడా వారిలో గుండె దడ, నిద్రలేమి, జీర్ణకోశ సమస్యలకు దారితీస్తుంది. అందుకే పిల్లలు, టీనేజర్లు ఎనర్జీ డ్రింక్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని 'అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్' స్పష్టం చేస్తోంది. చిన్న వయసులోనే శరీరంలోకి అధిక చక్కెర చేరడం వల్ల భవిష్యత్తులో క్రానిక్ వ్యాధుల బారిన పడే ముప్పు ఉంది. తక్షణ శక్తి కోసం కృత్రిమ పానీయాలపై ఆధారపడే బదులు.. కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు, మజ్జిగ, నిమ్మరసం వంటి సహజసిద్ధమైన పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
