Persistent Cough : ఎడతెరపి లేకుండా దగ్గు వేధిస్తోందా..? అది గుండె జబ్బుకు సంకేతం కావొచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దగ్గుల్లో రకరకాలున్నాయి. సాధారణ దగ్గు, తీవ్రమైన దగ్గు.. ముఖ్యంగా ప్రస్తుతం మారిన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుండె సమస్య అనగానే ఛాతీ నొప్పి, ఆయాసం, గుండె దడ వంటి లక్షణాలే మనకు గుర్తొస్తాయి. అయితే, దీర్ఘకాలంగా వేధిస్తున్న దగ్గు కూడా గుండె జబ్బులకు సంకేతం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దగ్గును కేవలం టీబీ లేదా ఊపిరితిత్తుల సమస్యగా మాత్రమే భావించి కొట్టిపారేయకూడదని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

దగ్గుకూ, గుండెకూ సంబంధం ఏంటి..?

గుండె వైఫల్యం (heart failure) వంటి సమస్యలు తలెత్తినప్పుడు, గుండె శరీరానికి అవసరమైన స్థాయిలో రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఈ పరిస్థితిలో ఊపిరితిత్తుల్లో ద్రవాలు (water) చేరతాయి. వైద్య పరిభాషలో దీనిని 'పల్మనరీ కంజెషన్' (Pulmonary Congestion) అంటారు. ఇలా ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఆయాసం, ఛాతీలో భారం, తీవ్రమైన దగ్గు మొదలైనవి వస్తాయని అమెరికాలోని ఉటా విశ్వవిద్యాలయ అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు..

దగ్గుతో పాటు ఆయా లక్షణాలు కనిపిస్తే గుండె సమస్య ఉన్నట్లుగా అనుమానించాలి. వీటిని ఏమాత్రం విస్మరించకూడదని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ వెల్లడిస్తోంది. రాత్రి పడుకున్నప్పుడు దగ్గు తీవ్రమవడం. వెల్లకిలా పడుకోగానే దగ్గుతో పాటు ఆయాసం రావడం. దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవడం. ఛాతీలో బరువుగా లేదా ఒత్తిడిగా, పట్టేసినట్లు అనిపించడం. దగ్గుతో పాటు నురగతో కూడిన కఫం (sputum) రావడం.. వంటి లక్షణాలు, ముఖ్యంగా నురగతో కూడిన కఫం, అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం వంటివి అత్యవసర పరిస్థితికి సంకేతాలు. ఇలాంటప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

అలాగని దీర్ఘకాలిక దగ్గు అనగానే అది కచ్చితంగా గుండె జబ్బే అని భయపడాల్సిన అవసరం లేదు. సాధారణ జలుబు, అలెర్జీలు, ఆస్తమా, టీబీ వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇలా జరగవచ్చు. కానీ, రెండు మూడు వారాలకు పైగా దగ్గు వేధిస్తున్నా.. దాంతో పాటే పాదాల్లో వాపులు, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం వంటివి గమనిస్తే మాత్రం తప్పనిసరిగా గుండె సంబంధిత పరీక్షలు అంటే ఈసీజీ, టూడీ ఎకో వంటివి చేయించుకోవాలి. 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.