బ్లూ టీ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?  

షేర్ చేయండి:
బ్లూ టీ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?  

సాక్షి లైఫ్ : పొద్దున్నే నిద్రలేవగానే "టీ" ప్రేమికులు ఒక కప్పు వేడి వేడి టీ తాగడంతోనే రోజును ప్రారంభిస్తుంటారు. అలసట నుంచి బయట పడటానికి "టీ" లవర్స్ అనేక రకాల టీలను తీసుకుంటారు. అటువంటి టీ రకాలలో బ్లూ "టీ" కూడా ఒకటి. అపరాజిత టీని బ్లూ టీ అంటారు. అపరాజిత పువ్వును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. 

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ అపరాజిత పువ్వులో ఉన్నాయి. ఈ పువ్వును శంఖు పువ్వు, బటర్ ఫ్లై పీ ఫ్లవర్ అని కూడా అంటారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తపోటును నియంత్రించడంలో, బరువు తగ్గడంలో సహాయపడతాయి. బ్లూ టీ తాగడం వల్ల కలిగే లాభాలు, దానిని తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లూ టీ తయారు చేసే విధానం..? 

బ్లూ "టీ"ని క్లిటోరియా టెర్నేటియా (అపరాజిత పువ్వులు) ఎండిన రేకుల నుంచి తయారు చేస్తారు. బ్లూ టీ చేయడానికి ముందుగా ఒక కప్పు నీటిని  వేడి చేసి అందులో 4 నుంచి 5 అపరాజిత పువ్వులు వేయండి. ఇప్పుడు ఈ నీటిని 5 నిమిషాలు మరిగించాలి. కావాలంటే ఈ టీలో పుదీనా, అల్లం, లెమన్ గ్రాస్‌ని కూడా ఉపయోగించుకుని రుచిని పెంచుకోవచ్చు. ఈ నీటిని 5 నిమిషాలు మరిగిస్తే దాని రంగు నీలం రంగులోకి మారుతుంది. అందుకే ఈ టీని బ్లూ టీ అంటారు. అందులో ఒక చెంచా తేనె కలుపుకుని  తాగాలి.

బ్లూ "టీ" తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలివే.. 

రోగనిరోధక శక్తి..
బ్లూ టీ తీసుకోవడం వల్ల మనిషిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ టీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

మధుమేహం ఉన్నవారికి..  

అపరాజిత పువ్వుతో తయారుచేసిన "టీ" మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ టీలో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి, దీని కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. 

అదుపులో రక్తపోటు..

అపరాజిత పుష్పాలతో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.

వృద్ధాప్య సమస్య.. 

బ్లూ టీ తీసుకోవడం ద్వారా వృద్ధాప్య సమస్యను అధిగమించవచ్చు. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ముఖంపై ఉండే ముడతలతోపాటు, వృద్ధాప్య సంకేతాలను కూడా దూరం చేసుకోవచ్చు.

అధిక బరువు..  

పెరుగుతున్న బరువును నియంత్రించడంలో ఈ టీ సమర్థవంతమైన పనితీరు కనబరుస్తుంది. కాబట్టి బరువు తగ్గాలంటే అపరాజిత పువ్వులతో చేసిన టీని ప్రతి రోజూ ఉదయం తాగాలి. ఈ టీ తాగడం వల్ల మెటబాలిజం పెరిగి కొవ్వు కరిగిపోతుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి.. యూరిక్ యాసిడ్ ఎంత ఉంటే నార్మల్..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.