Kangaroo Mother Care : నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు 'కంగారూ మదర్ కేర్'.. ఎందుకంత ముఖ్యం..?
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒక శిశువు నెలలు నిండకుండానే (Premature Babies) జన్మిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా. అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, బరువు తక్కువగా ఉండటం వల్ల ఈ శిశువులకు పుట్టిన వెంటనే ప్రత్యేక సంరక్షణ ఎంతో అవసరం. ఉష్ణోగ్రత పడిపోవడం, ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యల నుంచి వీరికి రక్షణ కల్పించే అత్యుత్తమ సహజసిద్ధమైన పద్ధతే 'కంగారూ మదర్ కేర్ (Kangaroo Mother Care - KMC)'.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
కంగారూ తన పిల్లను పొత్తికడుపులోని సంచిలో ఎలాగైతే వెచ్చగా దాచుకుంటుందో.. తల్లి కూడా తన బిడ్డను ఛాతీకి హత్తుకుని పెంచే విధానమే ఇది. ఇందులో ప్రధానంగా 'స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్' అంటే తల్లి, బిడ్డల చర్మం నేరుగా స్పర్శించుకోవడం, 'తల్లిపాలు పట్టడం' అనే రెండు అంశాలు ఇమిడి ఉంటాయి.
ప్రీమెచ్యూర్ పిల్లలకు కంగారూ కేర్ ప్రయోజనాలు..
నెలలు నిండని పిల్లలు తమ శరీర ఉష్ణోగ్రతను సొంతంగా నియంత్రించుకోలేరు. తల్లి గుండెలకు హత్తుకుని ఉండటం వల్ల వారికి సహజమైన వెచ్చదనం లభిస్తుంది. దీనివల్ల హైపోథర్మియా అంటే ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోవడం వంటి ముప్పు తప్పుతుంది.
తల్లికి హత్తుకుని ఉండటం వల్ల శిశువుకు తరచుగా పాలు పట్టడం సులువవుతుంది. తల్లి పాలలో ఉండే పోషకాల వల్ల పిల్లలు వేగంగా, ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. ప్రీమెచ్యూర్ శిశువుల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. తల్లిపాలు బిడ్డకు అవసరమైన యాంటీబాడీలను అందించి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.
తల్లి స్పర్శ, వెచ్చదనం వల్ల బిడ్డ సురక్షితంగా ఉన్నామనే భావనకు లోనవుతుంది. ఇది వారి శ్వాసక్రియను, గుండె కొట్టుకునే వేగాన్ని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. చర్మ స్పర్శ, తల్లిపాలు శిశువు మెదడు, నాడీ వ్యవస్థ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడ తాయి. భవిష్యత్తులో పిల్లల ఎదుగుదలపై ఇది సానుకూల ప్రభావం చూపుతుంది. తల్లి గుండె చప్పుడు వినడం వల్ల బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతుంది. ఈ స్పర్శ వల్ల ఇద్దరి మధ్య భావోద్వేగ అనుబంధం మరింత బలపడుతుంది.
కంగారూ మదర్ కేర్ ఎలా చేయాలి..?
తల్లి మంచం మీద వెనక్కి ఆనుకుని లేదా సౌకర్యవంతమైన కుర్చీలో కూర్చోవాలి. శిశువుకు కేవలం డైపర్, టోపీ మాత్రమే ఉంచి తల్లి ఛాతీపై బోర్లా పడుకోబెట్టాలి. బిడ్డకు శ్వాస సులువుగా ఆడేలా తలను ఒక పక్కకు తిప్పి ఉంచాలి. వెచ్చదనం కోసం బిడ్డ వీపుపై ఒక శుభ్రమైన వస్త్రాన్ని లేదా ప్రత్యేకమైన కేఎంసీ ర్యాప్ (KMC Wrap)ను కప్పాలి.
ఈ సమయంలో శిశువు శ్వాస, చర్మం రంగును గమనిస్తూ వీలైనప్పు డల్లా పాలు పట్టించాలి. ఈ విధానాన్ని రోజులో 8 నుంచి 24 గంటల పాటు.. వీలైనంత ఎక్కువ సమయం చేయాలని వైద్యులు సూచిస్తారు. ఒకవేళ తల్లికి విశ్రాంతి అవసరమైనప్పుడు తండ్రి లేదా కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా ఈ 'స్కిన్ టు స్కిన్' కేర్ అందించవచ్చు.
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
