Yogasanas : గంటల తరబడి కూర్చుంటున్నారా..? సరైన భంగిమ, నొప్పుల నివారణకు అద్భుతమైన యోగాసనాలు..!
సాక్షి లైఫ్ : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని పనిచేయక తప్పట్లేదు. ఆఫీసులో సిస్టమ్ ముందు గంటల తరబడి కూర్చోవడం, ఖాళీ సమయంలో మొబైల్ చూస్తూ గడపడం వల్ల శరీర భంగిమ (body posture) దెబ్బతింటోంది. తప్పు భంగిమలో వంగి కూర్చోవడం వల్ల మెడ, భుజాలు, వెన్ను నొప్పి రావడం సర్వసాధారణం అయిపోయింది.
అయితే, రోజువారీ దినచర్యలో కొన్ని సులభమైన యోగాసనాలను చేర్చుకోవడం ద్వారా కండరాల బిగువును తగ్గించి, శరీర భంగిమను మెరుగుపరుచుకోవచ్చు. ఇంటి దగ్గరే సులభంగా చేసుకోగలిగే 5 యోగాసనాలు మీకోసం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
1. మార్జాలాసనం - బితిలాసనం (Cat-Cow Pose)..
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నెముక బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. దీని నివారణకు ఈ ఆసనం అద్భుతంగా పనిచేస్తుంది.
చేయాల్సిన విధానం..రెండు చేతులు, మోకాళ్లపై నాలుగు కాళ్ల జంతువులా నిల్చోవాలి. గాలి పీలుస్తూ పొట్టను కిందికి వంచి, ఛాతీని పైకి లేపాలి. గాలి వదులుతూ వెనుక భాగాన్ని పైకి వంచుతూ గడ్డాన్ని ఛాతీకి ఆనించాలి. ఇలా నెమ్మదిగా 8 నుంచి 10 సార్లు చేయాలి. దీనివల్ల మెడ, వెన్ను కండరాలు సాగి ఉపశమనం కలుగుతుంది.
2. బాలాసనం (Child's Pose)..
ఇది వెన్ను, భుజాలు, నడుముకు విశ్రాంతినిచ్చే అత్యంత సులభమైన ఆసనం. రోజంతా అలసిపోయిన శరీరానికి ఇది మంచి రిలాక్సేషన్ ఇస్తుంది.
చేయాల్సిన విధానం.. మోకాళ్లపై కూర్చుని నెమ్మదిగా ముందుకు వంగాలి. రెండు చేతులను ముందుకు చాచి, నుదురును నేలకు ఆనించాలి. ఈ భంగిమలో 30 నుంచి 60 సెకన్ల పాటు ఉండి సాధారణంగా శ్వాస తీసుకోవాలి.
3. భుజంగాసనం (Cobra Pose)..
ల్యాప్‌టాప్‌ల ముందు ముందుకు వంగి పనిచేసే అలవాటు ఉన్నవారు కచ్చితంగా చేయాల్సిన ఆసనం ఇది.
చేయాల్సిన విధానం.. బోర్లా పడుకుని రెండు అరచేతులను భుజాల దగ్గర నేలపై ఉంచాలి. నెమ్మదిగా అరచేతుల సాయంతో ఛాతీని పైకి లేపాలి. భుజాలు చెవులకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. నడుముపై మరీ ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడాలి. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉండి మళ్లీ కిందికి రావాలి.
4. అధోముఖ శ్వానాసనం (Downward-Facing Dog)..
ఈ ఆసనంలో శరీరం రివర్స్ 'V' ఆకారంలో ఉంటుంది. ఇది భుజాలు, వెన్ను, కాళ్ల కండరాలను సాగదీసి ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది.
చేయాల్సిన విధానం.. చేతులు, కాళ్లను నేలకు ఆనించి, తుంటి భాగాన్ని వీలైనంత పైకి, వెనక్కి లేపాలి. అవసరమైతే మోకాళ్లను కొద్దిగా వంచుకోవచ్చు. ఈ స్థితిలో కొద్దిసేపు ఉండి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి.
5. తాడాసనం (Mountain Pose)..
సరైన శరీర భంగిమను, బ్యాలెన్స్‌ను తెలుసుకోవడానికి ఇది ఉత్తమమైన ఆసనం. దీన్ని ఎక్కడైనా సులభంగా వేయవచ్చు.
చేయాల్సిన విధానం.. నిటారుగా నిలబడి రెండు కాళ్ల మధ్య కొద్దిగా దూరం ఉంచాలి. శరీర బరువు రెండు కాళ్లపై సమానంగా పడేలా చూసుకోవాలి. భుజాలను వెనక్కి ఉంచి, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. చూపును నేరుగా ఉంచి నిమిషం పాటు సాధారణ శ్వాస తీసుకోవాలి.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు.. యోగా చేసేటప్పుడు ఎలాంటి తొందరపాటు వద్దు. ప్రారంభంలో రోజూ 10 నుంచి 15 నిమిషాలు కేటాయించి శ్వాసపై ధ్యాస ఉంచుతూ నెమ్మదిగా సాధన చేయాలి. ఆఫీసులో కూడా గంటకోసారి కుర్చీలోంచి లేచి కాస్త నడవాలి. మెడ, భుజాలను తేలికగా స్ట్రెచ్ చేయాలి.
యోగా చేస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి, కళ్లు తిరగడం, అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆపేయాలి. ఇప్పటికే వెన్ను లేదా మెడ నొప్పితో బాధపడుతున్నవారు, సర్జరీలు అయినవారు వైద్యులు లేదా నిపుణులైన యోగా శిక్షకుల సలహా మేరకే ఈ ఆసనాలు చేయాలి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
