kidney stones : నడుము, పొత్తికడుపులో భరించలేని నొప్పా..? కిడ్నీలో రాళ్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శరీరంలోని వ్యర్థాలను, మలినాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు (Kidneys) కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మూత్రంలో కొన్ని రకాల ఖనిజాలు, లవణాల శాతం పెరిగినప్పుడు అవి చిన్న చిన్న స్ఫటికాలుగా (crystals) మారుతాయి. అవే కాలక్రమంలో గట్టిపడి రాళ్లుగా (kidney stones) మారతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడిన ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. అవి కదిలినప్పుడు లేదా మూత్రనాళంలో ఇరుక్కున్నప్పుడు మాత్రం ప్రాణం పోయేంత నొప్పి వస్తుంది. కిడ్నీ స్టోన్స్‌కు సంబంధించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

1. ఎలాంటి లక్షణాలు లేకుండానే..

కిడ్నీలో చిన్న చిన్న రాళ్లు ఏర్పడినప్పుడు చాలా కాలం పాటు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అసలు కిడ్నీలో రాళ్లు ఉన్నాయన్న విషయం కూడా బాధితులకు తెలియదు. కానీ, ఆ రాళ్లు నెమ్మదిగా కదులుతూ మూత్రనాళంలోకి చేరినప్పుడు లేదా మూత్ర విసర్జనకు ఆటంకం కలిగించినప్పుడు మాత్రం అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి మొదలవుతుంది.

2. నీళ్లు తక్కువగా తాగడమే ప్రధాన కారణం..!

శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోవడం వల్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. శరీరంలో నీరు తక్కువైనప్పుడు మూత్రం చిక్కబడుతుంది. దీనివల్ల అందులోని ఖనిజాలు ఒకదానికొకటి అతుక్కుపోయి రాళ్లుగా మారతాయి. కాబట్టి రోజంతా తగినన్ని నీళ్లు తాగడం చాలా ముఖ్యం.

3. నడుము, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి..

కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు నడుము లేదా వీపు కింది భాగంలో ఒకవైపు భరించలేని నొప్పి వస్తుంది. ఈ నొప్పి పొత్తికడుపు నుంచి కిందకు వ్యాపిస్తుంది. మూత్రంలో రక్తం పడటం, మూత్ర విసర్జన సమయంలో మంట, తరచుగా మూత్రం రావడం, వికారం, వాంతులు కావడం వంటివి కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు.

4. మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది..!

ఒకసారి ఆపరేషన్ లేదా మందుల ద్వారా రాళ్లను తొలగించినంత మాత్రాన, భవిష్యత్తులో మళ్లీ రాళ్లు ఏర్పడవని గ్యారెంటీ లేదు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి గల మూలకారణాన్ని సరిచేసుకోకపోతే మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏర్పడిన రాయి ఏ రకానికి చెందినదో పరీక్షించి, దానికి తగ్గట్లుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ఎంతో ప్రయోజనకరం.

5. ఆహారం, నీటి విషయంలో జాగ్రత్తలు..

కిడ్నీ రాళ్ల బారిన పడకుండా ఉండాలంటే తగినంత నీరు తాగడంతో పాటు ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే, వైద్యుల సలహా లేకుండా పాలు, క్యాల్షియం ఉన్న ఆహారాలను పూర్తిగా మానేయకూడదు. ఎందుకంటే శరీరానికి తగినంత క్యాల్షియం కూడా అవసరమే.

నడుము లేదా పొత్తికడుపులో భరించలేని నొప్పి వచ్చినా, మూత్రంలో రక్తం కనిపించినా లేదా మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉన్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. తీవ్రమైన నొప్పితో పాటు జ్వరం, చలి, నిరంతర వాంతులు లేదా అసలు మూత్రం రాకపోవడం లాంటివి కనిపిస్తే ప్రమాదకరమైన పరిస్థితిగా గుర్తించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.