ఏసీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..?
సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా వేసవికాలం మొదలైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతతో, అనేక రకాల ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆరోగ్య నిపుణులు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వేసవికాలంలో శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా ఉంచడానికి నిరంతరం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండలు పెరుగుతున్న కొద్దీ, ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) వాడకం కూడా పెరుగుతుంది. ఏసీలు మండే వేడి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. కానీ అధికంగా ఏసీ వాడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. అవేంటంటే..?
ఎయిర్ కండిషనర్ అనేది ఆధునిక జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది, ఇది మండే వేడి నుండి ఉపశమనం పొందడానికి సమర్థవంతమైన మార్గంగా పరిగణించినప్పటికీ, మన ఆరోగ్యంపై ఎయిర్ కండిషనర్ వల్ల దుష్ప్రభావాలు వస్తాయి..ఎండవేడిమి సమయంలో ఏసీని వాడటం చాలా హాయిగా ఉంటుంది. కానీ దీన్ని నిరంతరంగా, ఎక్కువ సేపు వాడితే చర్మానికి, కళ్లు, శ్వాసనాళాలకు సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..
ఏసీల వల్ల అంటు వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల ఏసిల నిర్వహణ ,శుభ్రతతో పాటు, గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
డీహైడ్రేషన్..
వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తక్కువ నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఎయిర్ కండిషనింగ్ గాలిలో తేమను తగ్గిస్తుందని మీకు తెలుసా..? ఇది డీహైడ్రేషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఏసీ చల్లదనం వల్ల నీరు తక్కువగా తాగుతాం, శరీరంలోపల పొడిగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో ఎక్కువ సమయం ఏసీ లో గడిపే వ్యక్తులకు కూడా డీహైడ్రేషన్ పెరిగే ప్రమాదం ఉంది.
చర్మం, కంటి సమస్యలు..
ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల వచ్చే మరో సైడ్ ఎఫెక్ట్ మీ కళ్ళు ,చర్మం ఆరోగ్యంపై కూడా పడుతుంది. దీని కారణంగా చర్మం తేమను కోల్పోతుంది. చర్మం పొడిగా మారుతుంది. చర్మమే కాకుండా ఏసీని ఎక్కువగా వాడేవారిలో కళ్లు పొడిబారే ప్రమాదం ఉంది. దీనిని పొడికళ్ల సమస్య అంటారు. గదిలో తక్కువ తేమ స్థాయి కళ్ళ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
శ్వాసకోశ సమస్యల ప్రమాదం..
ఎయిర్ కండిషనర్లు శ్వాసకోశ వ్యవస్థపై ఎఫెక్ట్ బాగా పడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో చల్లని గాలి మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దగ్గు, తుమ్ములు, గొంతులో అసౌకర్యం కలుగుతుంది. అలెర్జీలు లేదా ఉబ్బసంతో బాధపడుతున్న వ్యక్తుల్లో కూడా ఏసీ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
ఇది కూడా చదవండి.. ఆటిజం ఉన్న చిన్నారులతో ఎలా ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
