Health Problems : దిండును మడిచి పడుకుంటున్నారా..? ఐతే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నిద్రలో మెడకు ఆసరా కోసమో, మొబైల్ చూసుకునేందుకో చాలామంది దిండును మడిచి, ఎత్తుగా పెట్టుకుని పడుకుంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తుందని, దీనివల్ల శరీరంలో పలు రకాల సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మెడనొప్పి, సర్వైకల్ ముప్పు..

దిండును మడిచి పడుకున్నప్పుడు తల ఎత్తు 4 నుంచి 6 అంగుళాలు పెరిగి, మెడ 45 డిగ్రీల ముందుకు వంగుతుంది. దీంతో రాత్రంతా మెడ కండరాలు, నాడులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పడుతుంది. తద్వారా రక్తప్రసరణ సరిగ్గా జరగక ఉదయం లేచేసరికి మెడ పట్టేస్తుంది. రోజూ ఇలాగే చేస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

 

నడుము, వెన్నునొప్పికి కారణం..

మన వెన్నెముక సహజంగా ఆంగ్ల అక్షరం 'S' ఆకారంలో ఉంటుంది. ఎత్తైన దిండు వల్ల తల బాగా పైకి లేచి, వీపు పైభాగం వంగిపోతుంది. దీనివల్ల నడుము కింది భాగంపై భారం పడుతుంది. ఈ తప్పుడు భంగిమ కారణంగా వెన్నెముక డిస్క్‌లపై ఒత్తిడి పెరిగి దీర్ఘకాలిక వెన్నునొప్పి, స్లిప్ డిస్క్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.

శ్వాసకోశ ఇబ్బందులు, గురక..

దిండును మడిచి పెట్టుకున్నప్పుడు గడ్డం ఛాతీ వైపు వంగిపోయి, శ్వాసనాళం సగం మూసుకుపోతుంది. ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో శరీరానికి ఆక్సిజన్ అందించేందుకు ఎక్కువ శ్రమించాల్సి వచ్చి నిద్రలో గురక మొదలవుతుంది. ఆస్తమా, స్లీప్ ఆప్నియా ఉన్నవారికి ఈ అలవాటు మరింత ప్రమాదకరం.

చేతులు, భుజాలు మొద్దుబారడం..

ఎత్తైన దిండుపై పడుకున్నప్పుడు భుజాలు లోపలికి ముడుచుకు పోయి చేతులకు వెళ్లే నరాలు నొక్కుకుపోతాయి. దీంతో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి ఉదయం నిద్రలేచే సరికి చేతులు మొద్దుబారడం, వేళ్లలో జలదరింపు లాంటివి వస్తాయి. నిర్లక్ష్యం చేస్తే భుజాలు పూర్తిగా బిగుసుకుపోయే (frozen shoulder) ముప్పు ఉంటుంది.

నిద్రించేందుకు సరైన పద్ధతి ఏమిటి..?

మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా లేకుండా, మెడ వంపునకు సరైన ఆసరా ఇచ్చే ఒకే దిండును ఉపయోగించాలి. దాని ఎత్తు 4 నుంచి 6 అంగుళాలు మాత్రమే ఉండాలి. పడుకున్నప్పుడు మెడ, భుజాలు, వెన్నెముక ఒకే సరళ రేఖలో ఉండేలా చూసుకోవాలి. వెల్లకిలా లేదా పక్కకు తిరిగి పడుకోవడం ఉత్తమం. బోర్లా పడుకోవడం పూర్తిగా మానుకోవాలి. వాడే దిండును ప్రతి ఆరు నెలలకోసారి కనీసం ఎండలో పెట్టాలి. అలాగే ప్రతి 1 నుంచి 2 ఏళ్లకోసారి పాత దిండును మార్చేసి కొత్తది వాడటం ఆరోగ్యానికి మంచిది.

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.