ఈ సీజన్ లో తినకూడని ఆహారాలివే..
సాక్షి లైఫ్ : మాన్ సూన్ సీజన్‌లో ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలతో కూడిన కూరగాయలు కూడా ఆరోగ్యానికి హాని కలిగించడం ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే, తేమ పెరగడం వల్ల, రోజూ తినే ఈ పండ్లు, కూరగాయలలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది కడుపులోకి చేరుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్,జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో ఏ పండ్లు, కూరగాయలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఎండాకాలం ముగిసిన తర్వాత వర్షాకాలం ప్రారంభమవుతుంది. నెమ్మదిగా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోతుంది. వర్షాకాలం దానితో పాటు అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తెస్తుంది. వాటి నుంచి బయట పడాలంటే కొన్నిరకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.. సీజన్ మారుతున్న సమయంలో పలురకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు వైద్యనిపుణులు. మాన్ సూన్ సీజన్ లో ఎలాంటి ఆహారపదార్థాలను తీసుకోకూడదు..?
పుట్టగొడుగులు..
విటమిన్ డి పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. అయితే వర్షాకాలంలో దీనిని తినకూడదు. ఎందుకంటే వీటిని తేమతో కూడిన వాతావరణంలో పండిస్తారు. దీని కారణంగా వర్షాకాలంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
చేపలు..
వర్షాకాలంలో చేపలు లేదా రొయ్యలు వంటి సీ ఫుడ్ కు కూడా దూరంగా ఉండడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలం సముద్ర జీవులకు సంతానోత్పత్తి సమయం. ఈ సీజన్‌లో చేపలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
వంకాయ..
వర్షాకాలంలో వంకాయ తినడం వల్ల కడుపులో మంట, గ్యాస్ సమస్య పెరుగుతుంది. వర్షాకాలంలో ఇలాంటి కూరగాయల మొక్కలో ఫంగల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా మంది వర్షాకాలంలో వంకాయలను తినరు కూడా.
ఆకు కూరలు..
ఈ సీజన్‌లో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల ఆకుకూరల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బ్యాక్టీరియా పెరిగి పలురకాల ఇన్‌ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
మొలకెత్తిన గింజలు..
వర్షాకాలంలో మొలకెత్తిన ధాన్యాలు, పప్పుధాన్యాలకు కూడా దూరంగా ఉండాలి. అధిక తేమ కారణంగా మొలకెత్తిన ధాన్యాలు ఫంగస్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. దీని కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడమేకాకుండా, అనేక అనారోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
