Chatbot for Schizophrenia Patients : స్కిజోఫ్రీనియా రోగుల కోసం చాట్‌బాట్.. రష్యా పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ..
సాక్షి లైఫ్ : తీవ్రమైన మానసిక సమస్య అయిన 'స్కిజోఫ్రీనియా'తో బాధపడే రోగులకు సాంకేతికత అండగా నిలవనుంది. ల్యాబ్‌లు, ఆసుపత్రుల చుట్టూ తిరిగే పనిలేకుండా.. రోగుల మానసిక స్థితిని దూరం నుంచే పర్యవేక్షించేందుకు రష్యాకు చెందిన 'సెచెనోవ్ విశ్వవిద్యాలయం' పరిశోధకులు ఒక వినూత్న చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చారు. వైద్యుడిని సంప్రదించే వ్యవధిలో రోగి ఆరోగ్యం ఎప్పుడు క్షీణిస్తుందో ముందే పసిగట్టడం ఈ డిజిటల్ సాధనం ముఖ్య ఉద్దేశం. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ సైన్స్ పత్రిక 'కన్సార్టియం సైకియాట్రికమ్'లో ప్రచురితమయ్యాయి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..
ఎందుకీ చాట్‌బాట్..?
సాధారణంగా స్కిజోఫ్రీనియా రోగులలో వ్యాధి అదుపులోకి వచ్చినట్లే వచ్చి, మళ్లీ ఒక్కసారిగా తిరగబెడుతుంటుంది. అయితే క్రమంతప్పకుండా ఆసుపత్రికి వెళ్లినప్పటికీ, ఈ లోపే వ్యాధి తీవ్రత పెరగడాన్ని గుర్తించడంలో సాంప్రదాయ వైద్య పరీక్షలు కొన్నిసార్లు విఫలమవుతుంటాయి.
ముందస్తు హెచ్చరికలు..
వ్యాధి తీవ్రమవడానికి ముందే రోగులలో నిద్రలేమి, తీవ్ర ఆందోళన, చురుకుదనం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి ఈ రిమోట్ డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రయోగం సాగిందిలా..
ఈ కొత్త విధానాన్ని పరీక్షించడానికి పరిశోధకులు ఒక చిన్నపాటి ప్రయోగాన్ని నిర్వహించారు. స్కిజోఫ్రీనియా అదుపులో ఉన్న 15 మంది రోగులను ఎంపిక చేసి, 9 రోజుల పాటు ఉదయం, సాయంత్రం ఒక డిజిటల్ హెల్త్ డైరీని పూర్తి చేయమని కోరారు. ఇందులో వారి మానసిక లక్షణాలు, నిద్ర నాణ్యత, మందులు సరిగ్గా వాడుతున్నారా లేదా..? వంటి ప్రశ్నలను చాట్‌బాట్ ద్వారా అడిగారు. దీనితో పాటు, ఈ యాప్ ఉపయోగించడం ఎంతవరకు సులువుగా ఉందో తెలుసుకోవడానికి 21 రకాల సూచికలను విశ్లేషించారు.
సానుకూల ఫలితాలు..
ఈ డిజిటల్ డైరీ ప్రయోగంలో రోగుల నుంచి మంచి స్పందన లభించింది. 80శాతం మంది రోగులు తమకు ఇచ్చిన డైరీలను విజయవంతంగా పూర్తి చేశారు. అంతర్జాతీయంగా డిజిటల్ వైద్య రంగంలో ఉండే స్పందనతో ఇది సమానంగా ఉంది. 90శాతం మంది ఈ చాట్‌బాట్ వల్ల తమ సొంత ఆరోగ్యంపై తమకు మరింత అవగాహన పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. 53శాతం మంది రోగులు ఈ యాప్‌లో వివరాలు నమోదు చేయడం వల్ల తమ మానసిక స్థితి మెరుగైందని వెల్లడించారు.
మార్పులు అవసరం..
ఈ ప్రయోగం విజయవంతమైనప్పటికీ, ప్రాథమిక దశలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. డైరీ నింపే ప్రక్రియ కొంచెం విసుగుగా, అలసటగా ఉందని 47శాతంమంది చెప్పగా.. ప్రశ్నల సంఖ్యను తగ్గిస్తే బాగుంటుందని 67శాతం మంది అభిప్రాయపడ్డారు.
రోగికి విసుగు కలగకుండా సులభంగా ఉండేలా చూస్తూనే, వైద్యులకు అవసరమైన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించేలా ఈ చాట్‌బాట్‌లో త్వరలోనే మరిన్ని మార్పులు చేస్తామని డెవలపర్లు చెబుతున్నారు. దీర్ఘకాలిక మానసిక సమస్యలతో సతమతమయ్యే రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఇలాంటి డిజిటల్ సాధనాలు భవిష్యత్తులో ఎంతగానో తోడ్పడతాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
