Weight Lose : బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే మీ డైట్‌లో 'ఫైబర్' పెరగాల్సిందే..! శాస్త్రీయ కారణాలు ఇవే..
సాక్షి లైఫ్ : ప్రజెంట్ జనరేషన్ లో బరువు తగ్గడం, ఫిట్‌గా ఉండటం గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ సిఫార్సు చేసేది.. 'ఆహారంలో పీచుపదార్థం ఎక్కువగా ఉండాలి' అని.. సాధారణంగా పీచుపదార్థం జీర్ణక్రియకు మాత్రమే మంచిదని చాలామంది భావిస్తారు. కానీ, ఇది కేవలం మలబద్ధకాన్ని వదిలించడమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో ముఖ్యంగా బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా..? అసలు పీచుపదార్థానికి, బరువు తగ్గడానికి ఉన్న సంబంధం ఏంటి..? దాని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలేంటో ఓసారి చూద్దాం..!
ఇది కూడా చదవండి..Tooth Decay : దంతక్షయానికి ప్రధాన కారణాలు ఇవే..!
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
'ఫైబర్' అంటే ఏమిటి..? అది ఎలా పనిచేస్తుంది..?
మొక్కల ఆధారిత ఆహార పదార్థాలలో మన శరీరం జీర్ణం చేసుకోలేని భాగమే ఈ పీచుపదార్థం. ఇతర కార్బోహైడ్రేట్లలాగా మన శరీరం దీనిని అంత సులభంగా విచ్ఛిన్నం చేయలేదు. దీనివల్ల మనం తిన్న ఆహారం జీర్ణాశయంలో మెల్లగా జీర్ణమవుతుంది. ఫలితంగా కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సేపు ఉంటుంది. ఆకలి త్వరగా వేయకపోవడం వల్ల మనం తక్కువ క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటాం. అంతేకాదు, ఇది శరీరం అదనపు గ్లూకోజ్‌ను గ్రహించకుండా అడ్డుకుంటుంది.
నేరుగా కొవ్వు కరగకపోయినా.. బరువు తగ్గుతారు..!
వైద్య నివేదికల ప్రకారం.. పీచుపదార్థం నేరుగా శరీరంలోని కొవ్వును కరిగించదు. కానీ, బరువు తగ్గడానికి అవసరమైన వాతావరణాన్ని శరీరంలో సృష్టిస్తుంది. ముఖ్యంగా 'కరిగే పీచుపదార్థం' (Soluble Fiber) నీటిని గ్రహించి, జీర్ణాశయంలో ఒక జెల్ లాంటి పొరను ఏర్పరుస్తుంది. ఇది ఆహారం ముందుకు సాగే వేగాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఊరికే ఏదో ఒకటి తినాలనే కోరిక (Cravings) తగ్గుతుంది.
మంచి బ్యాక్టీరియాకు బలం..
పీచుపదార్థం మన పేగుల్లో ఉండే మేలు చేసే బ్యాక్టీరియాకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగై, మెటబాలిజం క్రమబద్ధం అవుతుంది.
పీచుతో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..
కార్బోహైడ్రేట్ల శోషణను పీచుపదార్థం నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల భోజనం చేసిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఫైబర్ అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. మలాన్ని మృదువుగా మార్చి, మలబద్ధకం సమస్య రాకుండా ప్రేగులను శుభ్రంగా ఉంచుతుంది.
రోజుకు ఎంత తీసుకోవాలి..? వనరులు ఏవి..?
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం.. ఒక వయోజన వ్యక్తి ప్రతిరోజూ 30 నుంచి 35 గ్రాముల ఫైబర్ తీసుకోవడం అవసరం. అయితే వారి వయసు, బరువును బట్టి ఈ పరిమాణం మారవచ్చు.
ఫైబర్ లభించే ముఖ్యమైన ఆహారాలు..
ఓట్స్, బార్లీ, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, జామకాయలు, ఆపిల్స్, బ్రోకలీ, చియా గింజలు (Chia seeds)ఆకు పచ్చటి కూరగాయల్లో పీచుపదార్థం సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి, క్రాష్ డైటింగ్‌లు చేస్తూ శరీరాన్ని ఇబ్బంది పెట్టే కన్నా.. రోజూ తినే ఆహారంలో పీచుపదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకుంటే ఆరోగ్యకరమైన పద్ధతిలో సులభంగా బరువు తగ్గొచ్చు.
ఇది కూడా చదవండి..Chatbot for Schizophrenia Patients : స్కిజోఫ్రీనియా రోగుల కోసం చాట్‌బాట్.. రష్యా పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
