Frequent Headaches : తలనొప్పి వేధిస్తోందా..? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పే..!
సాక్షి లైఫ్ : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధించే ప్రధాన సమస్య 'తలనొప్పి'. సాధారణ అలసటగా భావించి చాలామంది దీనిని లైట్ తీసుకుంటారు. మెడికల్ షాపునకు వెళ్లి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని తాత్కాలిక ఉపశమనం పొందుతుంటారు. అయితే, తరచూ వచ్చే తలనొప్పిని అంత తేలికగా తీసిపారేయకూడదని, అది శరీరంలో దాగి ఉన్న ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..War Impact : యుద్ధం ఎఫెక్ట్ : మరింత భారం కానున్న దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలు..
ఇది కూడా చదవండి..LynchVax Vaccine : క్యాన్సర్‌కు ముకుతాడు.. ముందే అడ్డుకునే 'లించ్‌వ్యాక్స్' టీకా..!
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
కారణాలు అనేకం..
నిత్యం వేధించే తలనొప్పుల వెనుక మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు మానసిక కారణాలు కూడా ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.మానసిక ఒత్తిడి.. ప్రస్తుత కాలంలో తలనొప్పికి ప్రధాన కారణం తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన. వీటివల్ల తల కండరాలు బిగుసుకుపోయి 'టెన్షన్ హెడేక్' (Tension Headache) వస్తుంది. ఇది తలకు ఇరువైపులా ఏదో బరువు పెట్టినట్లు అనిపిస్తుంది.
రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్ర వేళల్లో మార్పులు, సరిపడా నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి తీవ్రతరమవుతుంది. శరీరానికి అవసరమైనంత నీరు అందకపోవడం వల్ల కూడా తల భారంగా మారుతుంది.
మైగ్రేన్.. ఒక నాడీ సంబంధిత సమస్య..!
ఇటీవల కాలంలో మైగ్రేన్ అంటే పార్శ్వనొప్పి బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వైద్యులు దీనిని 'సైకోసోమాటిక్' రుగ్మతగా పరిగణిస్తారు. తలలో ఏదో ఒక వైపు మాత్రమే విపరీతమైన నొప్పి రావడం, నరాలు కొట్టుకుంటున్నట్లు అనిపించడం దీని ప్రధాన లక్షణం. ఈ నొప్పితో పాటు కొందరిలో వాంతులు, వికారం, కాంతి లేదా శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది పూర్తిగా నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్య కాబట్టి, సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఎంతో అవసరం.
చిన్న చిన్న మార్పులతో.. చెక్ పెట్టండిలా..!
జీవనశైలిలో కొన్ని సాధారణ మార్పులు చేసుకోవడం ద్వారా తలనొప్పిని చాలా వరకు నివారించవచ్చు. గంటల తరబడి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి తలనొప్పి వస్తుంది. అవసరమైతే కంటి పరీక్షలు చేయించుకుని కళ్లద్దాలు వాడాలి. సమయానికి ఆహారం తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి తలనొప్పికి దారితీస్తుంది. అతిగా టీ, కాఫీలు లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటే వెంటనే తగ్గించుకోండి.
ఇంట్లోనే ఉపశమనం..
తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాలతో తలనొప్పిని తగ్గించుకోవచ్చు. నుదుటిపై ఐస్ ప్యాక్ లేదా చల్లటి నీటిలో ఒక క్లాత్ ను తడిపి పట్టీగా ఉంచడం వల్ల రక్తనాళాల ఒత్తిడి తగ్గి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీ లేదా హెర్బల్ టీ తాగడం వల్ల మైగ్రేన్ లక్షణాలు తగ్గుతాయని పలు అధ్యయనాలు నిరూపించాయి.
ఎప్పుడు ప్రమాదకరం అంటే..?
ఉదయం పూట నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి రావడం, రోజురోజుకూ నొప్పి తీవ్రత పెరగడం, తలనొప్పితో పాటు మాట్లాడటంలో తడబాటు వంటి లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రాణాంతక సమస్యలకు సంకేతం కావచ్చు. ఇలాంటి విలక్షణమైన లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..Snakebite Crisis in Telangana : తెలంగాణలో పాముకాటుతో వందలో 13 మంది బలి..! ‘సీసీఎంబీ-లాకోన్స్’ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడి..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
