Sleep : నిద్రలో మన శరీరంలోని రహస్య వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసా..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే ఆ ఆరోగ్యం కేవలం మనం తినే ఆహారం, చేసే వ్యాయామంపైనే కాదు.. మనం ఎంత గాఢంగా నిద్రపోతామనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, అది శరీరం తనని తాను పునరుద్ధరించుకునే ఒక 'మరమ్మత్తు కేంద్రం'. అసలు నిద్రలో మన శరీరంలోని రహస్య వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
7 నుంచి 9 గంటల నిద్ర ఎందుకు అవసరం..?
వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి వయోజనుడికి నిత్యం 7 నుంచి 9 గంటల నిరంతరాయ నిద్ర అవసరమని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ స్పష్టం చేస్తోంది. ఆహారం, నీరు శరీరానికి ఎంత ముఖ్యమో.. గాఢ నిద్ర కూడా అంతే కీలకం. నిద్ర లేకపోతే ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెదడులో 'శుభ్రత'.. గ్లింఫాటిక్ వ్యవస్థ మాయాజాలం..
మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడు తనను తాను పునరుద్ధరించుకుంటుంది (Reset). రోజంతా మెదడులో పేరుకుపోయిన విషతుల్యాలను, వ్యర్థాలను గ్లింఫాటిక్ వ్యవస్థ బయటకు పంపిస్తుంది. ముఖ్యంగా అల్జీమర్స్‌కు కారణమయ్యే 'బీటా-అమైలాయిడ్' వంటి హానికరమైన ప్రోటీన్లను ఇది తొలగిస్తుంది. అందుకే రాత్రి బాగా నిద్రపోయిన వారు మరుసటి రోజు ఉత్సాహంగా, ఏకాగ్రతతో పని చేయగలుగుతారు.
కణాల మరమ్మత్తు.. కండరాల బలం..
నిద్రలో కేవలం మెదడు మాత్రమే కాదు, శరీరంలోని ప్రతి అణువు తనని తాను బాగు చేసుకుంటుంది. దెబ్బతిన్న కణాలను మరమ్మత్తు చేసి, కొత్త కణాల ఉత్పత్తిని శరీరం వేగవంతం చేస్తుంది. నిద్రలో ప్రోటీన్ సంశ్లేషణ జరగడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. నిద్ర సరిగ్గా లేకపోతే కండరాల నొప్పులు, నీరసం వేధిస్తాయి.
హార్మోన్ల సమతుల్యత..
మనం ఎంత ఆహారం తీసుకోవాలి..? ఎప్పుడు ఆపాలి..? అనేది నిద్రపైనే ఆధారపడి ఉంటుంది. నిద్ర సరిగ్గా లేనప్పుడు ఆకలిని పెంచే 'గ్రెలిన్' హార్మోన్ అధికమై, కడుపు నిండిన భావన కలిగించే 'లెప్టిన్' తగ్గిపోతుంది. దీనివల్ల అతిగా తినడం, ఫలితంగా ఊబకాయం బారిన పడటం జరుగుతుంది.
రోగనిరోధక శక్తికి రక్షణ కవచం..
ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు శరీరం 'సైటోకిన్స్' అనే ప్రోటీన్లను నిద్రలోనే ఉత్పత్తి చేస్తుంది. రోగనిరోధక కణాలు చురుగ్గా పనిచేయాలంటే నిద్ర తప్పనిసరి. నిద్ర లేమితో బాధపడేవారికి జలుబు, వైరల్ జ్వరాలు త్వరగా సోకే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. మంచి నిద్ర అంటే కేవలం కళ్లు మూసుకోవడం కాదు.. అది మెరుగైన రేపటి కోసం మీ శరీరం చేసుకునే తయారీ. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనం కోసం నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.