Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో గుండెపోటు (heart attack) కేసులు పెరుగుతుండటం మనల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మొన్నటికిమొన్న ఓ ప్రముఖ యువ గాయకుడు కేవలం 39 ఏళ్లకే గుండెపోటుతో కన్నుమూయడం చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో ఛాతీలో కొంచెం నొప్పిగానో, గుండె దడగానో అనిపిస్తే చాలు.. ఎక్కడ గుండెపోటు వచ్చిందోనని చాలామంది భయపడిపోతున్నారు.
అయితే, ఛాతీలో ఒత్తిడి, పెరిగిన హృదయ స్పందన, విపరీతమైన ఆందోళన వంటి లక్షణాలన్నీ గుండెపోటువే కానక్కర్లేదు. అవి 'పానిక్ అటాక్' అంటే తీవ్ర మానసిక ఆందోళన వల్ల కూడా కావచ్చు. ఈ రెండింటి లక్షణాలు పైకి ఒకేలా అనిపించినా.. వీటి కారణాలు, తీవ్రత పూర్తిగా భిన్నమైనవి. ఈ రెండింటి మధ్య తేడాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
రెండింటికీ తేడా ఏంటి..?
గుండెపోటు (Heart Attack)..గుండె కండరాలకు రక్తాన్ని, ఆక్సిజన్‌ను సరఫరా చేసే ధమనులలో (blood vessels) అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. ఇది ఒక తీవ్రమైన అత్యవసర వైద్య పరిస్థితి.
పానిక్ అటాక్ (Panic Attack)..ఇది ప్రధానంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. అకస్మాత్తుగా తీవ్రమైన భయం, ఆందోళన కలగడం వల్ల శరీరంపై ఒత్తిడి పడి ఈ అటాక్ వస్తుంది. ఇది భయానకంగా అనిపించినప్పటికీ చాలా సందర్భాలలో ప్రాణాంతకం కాదు.
ఈ సమస్యలు ఎందుకు వస్తాయి..?
తీవ్ర ఒత్తిడి, ఫోబియాలు, నిద్రలేమి, కెఫిన్ అధికంగా తీసుకోవడం వంటి కారణాల వల్ల పానిక్ అటాక్ ప్రేరేపితమవుతుంది. ఏదో ఘోరం జరిగిపోతోందనే భయం వెంటాడుతుంది. మరోవైపు, అధిక కొలెస్ట్రాల్, మితిమీరిన రక్తపోటు, చెడు జీవనశైలి వల్ల గుండె ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడి గుండెపోటుకు దారితీస్తుంది.
గుండెపోటు vs పానిక్ అటాక్.. లక్షణాల మధ్య తేడాలు..
గుండెపోటు, పానిక్ అటాక్ రెండింటికీ ప్రధాన వ్యత్యాసం వాటి నొప్పి స్వభావంలోనే ఉంటుంది. గుండెపోటు వచ్చే సమయంలో ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో పాటు గుంజినట్లు లేదా బిగుతుగా పట్టినట్లు అనిపిస్తుంది. అదే పానిక్ అటాక్ అయితే ఛాతీలో ఒత్తిడితో పాటు గుండె వేగంగా కొట్టుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే నొప్పి వ్యాపించే తీరును బట్టి కూడా దీనిని గుర్తించవచ్చు. గుండెపోటులో ఛాతీలో మొదలైన నొప్పి క్రమంగా ఎడమ చేయి, దవడ, మెడ లేదా వీపు భాగానికి వ్యాపిస్తుంది. కానీ, పానిక్ అటాక్‌లో నొప్పి ఎక్కడికీ వ్యాపించకుండా కేవలం ఛాతీ భాగంలోనే కేంద్రీకృతమై ఉంటుంది.
విశ్రాంతి తీసుకున్నా..
సమయం, ఇతర లక్షణాల పరంగా చూస్తే.. గుండెపోటు లక్షణాలు క్రమక్రమంగా పెరుగుతాయి. రోగి విశ్రాంతి తీసుకున్నా లేదా కూర్చున్నా ఈ నొప్పి అస్సలు తగ్గదు. దీనికి తోడు విపరీతంగా చల్లటి చెమటలు పట్టడం, కడుపులో అసౌకర్యం, వాంతులు అయినట్లు ఉండటం, శ్వాస ఆడకపోవడం వంటి తీవ్రమైన శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. మరోవైపు, పానిక్ అటాక్ అనేది ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా అకస్మాత్తుగా వస్తుంది. దీనివల్ల అకస్మాత్తుగా తీవ్రమైన భయం, వణుకు, వేగంగా శ్వాస తీసుకోవడం వంటివి జరిగి, సాధారణంగా కొన్ని నిమిషాల నుంచి అరగంటలో పరిస్థితి దానంతట అదే మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది.
పానిక్ అటాక్ అనేది కాసేపట్లో తగ్గిపోయే సమస్య అయినప్పటికీ, మొదటిసారి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సొంత వైద్యం చేసుకోకూడదు. ఛాతీలో నొప్పి తీవ్రమవుతూ ఎడమచేయికి వ్యాపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం (Emergency Medical Help) అందించడం ప్రాణాలను కాపాడుతుంది.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
