ఫుడ్ అలెర్జీ కి కారణాలు..?
సాక్షి లైఫ్ : కొన్ని సందర్భాల్లో పరిశుభ్రమైన ఆహారం తిన్న తర్వాత కూడా అనారోగ్యానికి గురికావడం, ఫుడ్ అలర్జీ తలెత్తడం జరుగుతుంది. ఒక నిర్దిష్ట ఆహారానికి అలెర్జీ ఉన్నవారు కొంతమంది ఉన్నారు. అసలు ఫుడ్ అలెర్జీ ఎందుకు సంభవిస్తుంది..? దీనికి కారణాలేంటి..? ప్రతి ఫుడ్ ఐటెమ్ చాలా మంది ఒంటికి పడదని మీరు చాలా సార్లు వినే ఉంటారు. కొన్ని ఆహారాలు తిన్న వెంటనే ఆయా సమస్యను మీరే అనుభవించి ఉండవచ్చు. కొందరికి సీ ఫుడ్ పడకపోవచ్చు. పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మరికొందరికి మొటిమలు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఫుడ్ అలెర్జీ అంటే ఏమిటి..?
ఫుడ్ అలర్జీ అనేది శరీర రోగనిరోధక వ్యవస్థ ప్రతిచర్య, ఇది ఒక నిర్దిష్ట ఆహార పదార్థాన్ని తిన్న తర్వాత తలెత్తుతుంది. అలర్జీని కలిగించే ఆహారాన్ని చిన్న మొత్తంలో తీసుకున్నా అలెర్జీ వస్తుంది.
ఫుడ్ అలెర్జీ లక్షణాలు సాధారణంగా పిల్లలు, శిశువులలో ఎక్కువగా కనిపిస్తాయి. కేవలం పిల్లల్లోనేకాదు వయస్సు తో సంబంధం లేకుండా అలెర్జీ వస్తుంది. ఐతే ఒక్కోసారి చాలా ఏళ్లుగా ఎలాంటి సమస్య లేకుండా తింటున్న ఆహార పదార్థాల ద్వారా కూడా కొన్నిసార్లు మీకు అలర్జీ రావచ్చు. ఫుడ్ అలెర్జీ లక్షణాలు కొందరిలో తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలు కూడా ఉంటాయి.
ఫుడ్ అలెర్జీ లక్షణాలు..ఎలా వుంటాయంటే..?
నోటిలో జలదరింపు లేదా దురద, దద్దుర్లు, పెదవులు, ముఖం, నాలుక, గొంతు లేదా శరీరంలోని ఇతర భాగాల వాపు, కడుపు నొప్పి, విరేచనాలు, వికారం లేదా వాంతులు.
అత్యంత తీవ్రమైన లక్షణం ఏమిటి..?
అలెర్జీ ప్రతిచర్య అత్యంత తీవ్రమైన రకాన్ని "అనాఫిలాక్సిస్" అంటారు. ఇది ప్రాణాంతకమైన అలెర్జీ రకం. దీనిలో మొత్తం శరీరం ప్రభావితమవుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాదు రక్తపోటు అకస్మాత్తుగా గణనీయంగా పడిపోతుంది. హృదయ స్పందన రేటు కూడా ప్రభావితమవుతుంది. " అనాఫిలాక్సిస్చి" కిత్సకు ఎపినెఫ్రైన్ (అడ్రినలిన్) ఇంజెక్షన్ ఇస్తుంటారు వైద్యులు.
ఈ ఆహారాలలో ఉండే ప్రోటీన్ల వల్ల కొన్నిరకాల ఫుడ్ అలెర్జీలు..
రొయ్యలు
ఎండ్రకాయలు
పీత వంటి సీఫుడ్
వేరుశనగ
చేప
కోడి గుడ్లు
ఆవు పాలు
గోధుమ
సోయా
వీటి వల్ల అలెర్జీ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా.. ?
ఏదైనా ఒక నిర్దిష్ట ఆహార పదార్థాన్ని తీసుకున్న తర్వాత మళ్లీ మళ్లీ ఏవైనా లక్షణాలు కనిపిస్తే, మీరు ఆ ఆహారంలో ఉన్న ఏదైనా పదార్ధం మీ శరీరానికి పడట్లేదని మీరు అర్థం చేసుకోవాలి. సాధారణంగా, గుడ్లు, చేపలు, గోధుమలు, పాలు, వేరుశెనగలు, డ్రై ఫ్రూట్స్ విషయంలో జీడిపప్పు, బాదం వంటి ఆహారాల వల్ల అలెర్జీలు రావచ్చు. మరికొందరికి ఇవి కాకుండా ఇతర ఆహార పదార్థాలు కూడా అలర్జీని కలిగిస్తాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
