Cholesterol Levels : తీపి ఎక్కువగా తింటున్నారా..? కొలెస్ట్రాల్, గుండెకూ ముప్పే..!
సాక్షి లైఫ్ : పండుగల సమయాల్లో మిఠాయిలు, పిండివంటలు ఆస్వాదించడం సహజం. అయితే తీపి పదార్థాలు కేవలం బరువు, రక్తంలో చక్కెర స్థాయిలనే కాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా గణనీయంగా ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిఠాయిల్లో అధికంగా ఉండే పంచదార, నెయ్యి, ట్రాన్స్‌ఫ్యాట్స్ గుండె ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
తీపితో కొలెస్ట్రాల్ ముప్పు ఎలా..?
సాధారణంగా నూనెలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటేనే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది భావిస్తారు. అయితే అధిక చక్కెర కూడా శరీరంలోని కొవ్వు సమతుల్యతను దెబ్బతీస్తుంది. చక్కెర నేరుగా చెడు కొలెస్ట్రాల్‌ను పెంచకపోయినప్పటికీ, మితిమీరిన తీపి వినియోగం వల్ల కాలేయం అదనపు కేలరీలను ట్రైగ్లిజరైడ్లుగా మారుస్తుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్లు అధికమైతే రక్తనాళాలు పూడుకు పోయే ప్రమాదం పెరుగుతుంది.
గులాబ్జామున్, లడ్డూ, బర్ఫీ వంటి సాంప్రదాయ స్వీట్లలో నెయ్యి, వెన్న అధికంగా వాడతారు. వీటిలోని శాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచుతాయి. మార్కెట్లో లభించే కొన్ని స్వీట్లు, బేకరీ ఉత్పత్తులలో వాడే వనస్పతిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, మంచి కొలెస్ట్రాల్ (HDL) శాతాన్ని తగ్గిస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరి ధమనుల గోడలపై పేరుకుపోయి నప్పుడు రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండెపోటు (Heart Attack), పక్షవాతం (Stroke) వంటి ముప్పులు పొంచి ఉంటాయి.
గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పరిమిత వినియోగం.. పండుగ వాతావరణంలో మిఠాయిలను అతిగా తినకుండా ఒకటి లేదా రెండు ముక్కలకే పరిమితం కావాలి. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు..తీపికి బదులుగా తాజా సీజనల్ పండ్లు, నట్స్, డ్రైఫ్రూట్స్ ఎంచుకోవడం మంచిది. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుదినుసులను భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
శారీరక శ్రమ..పండుగల వేళ వ్యాయామాన్ని విస్మరించకూడదు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. కుటుంబంలో గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్ (Lipid Profile) పరీక్ష చేయించుకుంటూ వైద్యుల సలహాలు పాటించాలి.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
