Sweets effect : పండుగ వేళ మితిమీరిన తీపి.. ఆరోగ్యానికి చేటు..! అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పండుగలు అనగానే ముందుగా గుర్తొచ్చేవి నోరూరించే మిఠాయిలు, పిండివంటలే. కాస్త తీపి తింటే శరీరానికి పెద్దగా నష్టం ఉండదు కానీ.. పండుగల సీజన్‌లో తెలియకుండానే పరిమితికి మించి స్వీట్లు లాగించేస్తుంటారు. దీనివల్ల కేవలం బరువు పెరగడమే కాకుండా, శరీరంలోని అంతర్గత అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రముఖ మెడికల్ ఆంకాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారంలో మోతాదుకు మించి చక్కెర చేరితే, అది జీవక్రియల (Metabolism) వ్యవస్థను దెబ్బతీస్తుందని, ముఖ్యంగా కాలేయం, పేగుల ఆరోగ్యం, కణాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

ఫ్యాటీ లివర్ ముప్పు.. 

మిఠాయిలు, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉపయోగించే ఫ్రక్టోజ్ రూపంలోని చక్కెర నేరుగా కాలేయం (Liver)పై ప్రభావం చూపుతుంది. అదనపు చక్కెరను కాలేయం కొవ్వుగా మారుస్తుంది. దీనివల్ల కణాల్లో కొవ్వు పేరుకుపోయి 'ఫ్యాటీ లివర్' (MASLD) సమస్యకు దారితీస్తుంది. అప్పటికే ఊబకాయం, మధుమేహం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారిలో ఈ ముప్పు మరింత వేగంగా పెరుగుతుంది.

పేగుల ఆరోగ్యం (Gut Health) దెబ్బతింటుంది.. 

మన పేగుల్లో జీర్ణక్రియను, రోగనిరోధక శక్తిని పెంచే కోట్లాది మంచి బ్యాక్టీరియా (Good Microbes) ఉంటుంది. అధిక చక్కెర, తక్కువ పీచుపదార్థాలు (Fiber) ఉన్న ఆహారం తీసుకుంటే ఈ బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం (Bloating), గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. పండుగ పూట స్వీట్లతో పాటు పండ్లు, పచ్చి కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే మంచిదని డాక్టర్ వోరా సూచిస్తున్నారు.

ఇన్సులిన్ రెసిస్టెన్స్.. అంతర్గత వాపు.. 

నిరంతరం ఎక్కువ మోతాదులో చక్కెరను తీసుకుంటే శరీరంలోని కణాలు ఇన్సులిన్ హార్మోన్‌కు స్పందించడం మానేస్తాయి. దీనినే 'ఇన్సులిన్ రెసిస్టెన్స్' అంటారు. అలాగే శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి (Oxidative stress), అంతర్గత వాపు (Chronic Inflammation) పెరుగుతాయి. కణాలు గ్లూకోజ్‌ను శక్తిగా మార్చుకోలేకపోవడం వల్ల టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. పెరిగిన బ్లడ్ షుగర్ స్థాయిలు క్రమంగా నరాలు, రక్తనాళాలను కూడా బలహీనపరుస్తాయి.

క్యాన్సర్ ముప్పు పరోక్షంగా..

చక్కెర నేరుగా క్యాన్సర్‌ను కలిగించకపోయినా.. దీర్ఘకాలం పాటు మితిమీరిన తీపి తినడం వల్ల వచ్చే స్థూలకాయం, వాపు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేవి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదకర కారకాలు. ఇవి రొమ్ము, కాలేయ, కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకుంటే ఈ ముప్పును నివారించవచ్చు.

పండుగల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

పరిమితి ముఖ్యం.. రోజు మొత్తంలో స్వీట్లను పరిమితంగానే తినాలి. ఒకేసారి ఎక్కువగా లాగించకూడదు. ఇంట్లో చేసినవే మేలు..మార్కెట్లో దొరికే రంగులు, ఎక్కువ పాకం ఉండే స్వీట్లకు బదులుగా, ఇంట్లో తక్కువ చక్కెరతో చేసినవి ఎంచుకోవాలి. నీళ్లు, వ్యాయామం..పండుగ హడావిడిలో ఉన్నా తగినన్ని నీళ్లు తాగాలి. రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. మధుమేహం (diabetes), ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నవారు పండుగల సమయంలో తమ ఆహారం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.