Mouth Ulcers : ఈ పోషకాలు తగ్గినా మౌత్ అల్సర్స్ వస్తాయా ..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తరచూ నోటి పూత (mouth ulcers) వేధిస్తోందా..? ఏదైనా తినాలన్నా, తాగాలన్నా తీవ్రమైన మంట, నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? సాధారణంగా నోటిలో పుండ్లు అనగానే కడుపులో వేడి అనో, లేదా ఎక్కువగా మసాలాలు, కారం తినడం వల్లే అని భావిస్తుంటారు. కానీ, తరచుగా నోటి పూత వేధిస్తుంటే దానికి కేవలం వేడి మాత్రమే కాదు, శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

పదే పదే నోటి పూత ఎందుకు వస్తుంది..?

సాధారణంగా నోటిలో పుండ్లు రెండు మూడు రోజుల్లో వాటంతట అవే లేదా చిన్నపాటి చిట్కాలతో తగ్గిపోతాయి. అయితే, కొందరిలో ఇవి పదే పదే వస్తుంటాయి. దీనికి పలు కారణాలు దోహదం చేయవచ్చు.

 గట్టిగా బ్రష్ చేయడం, వేడి పదార్థాలు తినడం వల్ల నాలుక లేదా పెదవి లోపలి భాగం కాలడం, మాట్లాడేటప్పుడు లేదా తినేటప్పుడు పొరపాటున పంటి కింద పడి కరచుకోవడం వల్ల పుండ్లు పడతాయి.

ఒత్తిడి, ఇతర కారణాలు..

 తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల మార్పుల వల్ల కూడా నోటి పూత వస్తుంది.

వ్యాధులు & మందులు: సీలియక్ డిసీజ్, క్రోన్స్ డిసీజ్ వంటి పేగు సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా అల్సర్లు వస్తాయి.

ఈ పోషకాల లోపం ఉంటే ముప్పే..!

అధ్యయనాల ప్రకారం.. శరీరంలో నిర్దిష్ట విటమిన్లు, మినరల్స్ లోపించినప్పుడు నోటి పూత ఎక్కువగా వస్తుంటుంది. రక్తంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ కీలకం. శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనత (anemia) తలెత్తుతుంది. దీనివల్ల నీరసం, అలసటతో పాటు తరచూ నోటి పూత వస్తుంది.

విటమిన్-బి12.. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. ఈ విటమిన్ లోపిస్తే నాలుక ఎర్రబడటం, మంట, నోటిలో పుండ్లు ఏర్పడతాయి.

ఫోలేట్ (విటమిన్-బి9).. కణాల వృద్ధికి అవసరమైన ఫోలేట్ లోపం వల్ల కూడా నోటి పూత వస్తుంది. దీన్ని నివారించేందుకు ఆకుకూరలు, పప్పులు, బీన్స్ ఎక్కువగా తీసుకోవాలి.

జింక్..గాయాలను మాన్పడంలో, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో జింక్ పాత్ర కీలకం. శరీరంలో జింక్ తగ్గినా పదే పదే నోటిలో పుండ్లు వస్తాయి.

ఉపశమనానికి ఏం చేయాలి..?

నోటి పూత ఉన్నప్పుడు కారం, పులుపు, ఎక్కువ ఉప్పు ఉన్న పదార్థాలకు, అతి వేడిగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.
సులభంగా నమలగలిగే మెత్తటి ఆహారం తీసుకోవాలి. పుష్కలంగా నీళ్లు తాగాలి. పళ్లు తోముకునేందుకు సున్నితమైన బ్రిసిల్స్ ఉన్న టూత్ బ్రష్ మాత్రమే వాడాలి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల మంట, నొప్పి నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?

నోటి పూత సాధారణంగా కొద్ది రోజుల్లోనే తగ్గిపోవాలి. కానీ పుండు మూడు వారాలైనా తగ్గకపోయినా, అంతకంతకూ పెద్దదవుతున్నా, పుండు నుంచి రక్తం కారుతున్నా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే నోటి పూతతో పాటు తీవ్రమైన జ్వరం రావడం, ఆహారం మింగడానికి కష్టంగా ఉండటం, లేదా శరీరంలోని ఇతర భాగాల్లో కూడా పుండ్లు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.