Heavy Rains and Floods Raise Disease Risk : భారీ వర్షాలు, వరదలతో అనారోగ్య ముప్పు.. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రెయినీ సీజన్ లో పడే భారీ వర్షాల కారణంగా వరదలు ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తుతూ ఉంటాయి.  ఇలాంటి విపత్తులు కేవలం ప్రాణ, ఆస్తి నష్టాలకే పరిమితం కావు. వరద నీరు తగ్గుముఖం పట్టేకొద్దీ అంటువ్యాధుల ముప్పు అత్యంత తీవ్రమవుతుంది. మురికి నీటితోపాటు, దోమల వృద్ధి, కలుషిత తాగునీటి వల్ల ఎటువంటి తీవ్రమైన వ్యాధులు ప్రబలుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి నుంచి ఎలా రక్షణ పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

వరదల తర్వాత పొంచి ఉండే ప్రధాన వ్యాధులు..  

1. లెప్టోస్పిరోసిస్ (Leptospirosis) ముప్పు..  

ఇది బ్యాక్టీరియా వల్ల వ్యాపించే అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్. వ్యాధి సోకిన ఎలుకలు, కుక్కలు లేదా ఇతర జంతువుల మూత్రం కలిసిన వరద నీటిలో నడవడం వల్ల ఇది మనుషులకు సోకుతుంది. ముఖ్యంగా కాలికి ఏవైనా గాయాలు, పగుళ్లు ఉంటే బ్యాక్టీరియా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తుంది.

లక్షణాలు..తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కళ్లు ఎర్రబడటం, వాంతులు.

ప్రభావం..సకాలంలో గుర్తించకపోతే మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది.

2. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు..

వర్షాల తర్వాత గుంతల్లో నిలిచిపోయిన నీరు ఏడిస్ ఈజిప్టి దోమల వృద్ధికి అనుకూలంగా మారుతుంది. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వేగంగా ప్రబలుతాయి.

లక్షణాలు..విపరీతమైన జ్వరం, కళ్ల వెనుక భాగంలో నొప్పి, కీళ్లు, ఒళ్లు నొప్పులు, చర్మంపై దద్దుర్లు రావడం.

ప్రభావం..డెంగ్యూ తీవ్రమైతే రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయి, అంతర్గత రక్తస్రావం జరిగే ముప్పు ఉంటుంది.

3. టైఫాయిడ్ (Typhoid).. 

వరదల సమయంలో మురుగునీరు తాగునీటి పైపుల్లోకి చేరి నీరు కలుషితం అవుతుంది. ఈ నీటిని తాగడం లేదా ఆ నీటితో వండిన ఆహారం తినడం వల్ల 'సాల్మొనెల్లా టైఫీ' అనే బ్యాక్టీరియా కడుపులోకి చేరుతుంది.

లక్షణాలు..అధిక జ్వరం, తీవ్ర నీరసం, కడుపు నొప్పి, మలబద్ధకం లేదా విరేచనాలు.

ప్రభావం..నిర్లక్ష్యం చేస్తే ఇది పేగుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది.

4. హెపటైటిస్, కలరా..

హెపటైటిస్ ఏ, ఇ (Hepatitis A & E)..కలుషిత నీటిని తాగడం వల్ల ఈ వైరస్‌లు నేరుగా కాలేయంపై దాడి చేస్తాయి.

కలరా (Cholera)..వరద నీటిలో ఉండే 'విబ్రియో కలరే' వంటి బ్యాక్టీరియాల వల్ల కలరా సోకి, తీవ్రమైన విరేచనాలు, డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది.

నివారణా చర్యలు-తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని కనీస జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన సురక్షితమైన నీటినే తాగాలి.

ఆరుబయట విక్రయించే ఆహార పదార్థాలు, కలుషిత నీటితో వండే జంక్‌ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.

భోజనానికి ముందు, మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

వరద నీటిలో నడవాల్సి వస్తే, తప్పనిసరిగా బూట్లు ధరించాలి. ఇంటికి వచ్చాక కాళ్లను యాంటీ సెప్టిక్ లోషన్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమ తెరలు, మస్కిటో రిపెల్లెంట్లను వాడాలి.

తీవ్రమైన జ్వరం, చర్మంపై దద్దుర్లు, తగ్గని విరేచనాలు, కామెర్లు, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.