Health Problems in Winter : చలికాలంలో తరచూ కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలా..? మీ ఈ అలవాట్లే కారణం కావొచ్చు..!
సాక్షి లైఫ్ : చలికాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్ల నుంచి రోజువారీ దినచర్య వరకు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వాతావరణం చల్లగా ఉండటంతో దాహం తక్కువగా వేయడం, వ్యాయామానికి దూరంగా ఉండటం, వేడివేడిగా నూనెలో వేయించిన పదార్థాలు తినడానికి ఆసక్తి చూపడం సహజం. అయితే, ఈ అలవాట్లు నేరుగా మన జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఫలితంగా చలికాలంలో చాలామంది గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.
చాలామంది వీటిని వాతావరణ మార్పుల వల్ల వచ్చే సాధారణ ఇబ్బందులుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, వీటి వెనుక మన రోజువారీ పొరపాట్లే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబు తున్నారు. చలికాలంలో పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏ అలవాట్లను మార్చుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలకు దారితీసే ప్రధాన అలవాట్లు..
1. తగినంత నీరు తాగకపోవడం..
వేసవితో పోలిస్తే చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది. దీనివల్ల చాలామంది నీరు తాగడం తగ్గించేస్తారు. శరీరంలో నీటి శాతం తగ్గితే మలం గట్టిపడి మలబద్ధకం (Constipation) సమస్య తలెత్తుతుంది. కాబట్టి దాహం వేయకపోయినా రోజంతా తగినంత నీరు తాగాలి. చల్లని నీరు తాగలేకపోతే గోరువెచ్చని నీటిని తీసుకోవడం మరీ మంచిది.
2. నూనెలో వేయించిన ఆహారం ఎక్కువగా తినడం..
చలిగా ఉన్నప్పుడు వేడివేడి బజ్జీలు, సమోసాలు, పరోటాలు, మసాలా వంటకాలు తినాలనిపిస్తుంది. వీటిని పరిమితికి మించి తినడం వల్ల అసిడిటీ, కడుపులో మంట, అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలు మొదలవుతాయి.
3. శారీరక శ్రమ తగ్గించడం..
ఉదయాన్నే ఉండే విపరీతమైన చలి కారణంగా చాలామంది వాకింగ్, వ్యాయామం చేయడం మానేస్తారు. శారీరక కదలికలు తగ్గితే పేగుల కదలికలు (Bowel movements) నెమ్మదిస్తాయి. ఇది నేరుగా మలబద్ధకానికి దారితీస్తుంది.
ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..: Electric Comb : బట్టతలకు ఎలక్ట్రిక్ దువ్వెన తో చెక్ పెట్టొచ్చు.. 97.85శాతం జుట్టు పెరుగుదల..
4. సమయపాలన లేని భోజనం..
చలికాలంలో ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వల్ల బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా చేయడం, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వంటివి జరుగుతుంటాయి. ఇలా వేళాపాళా లేకుండా తినడం వల్ల జీర్ణరసాల విడుదలలో మార్పులు వచ్చి గ్యాస్, అసిడిటీ సమస్యలు పెరుగుతాయి.
5. పీచుపదార్థం (fiber) తక్కువగా తీసుకోవడం..
శీతాకాలంలో పండ్లు, పచ్చి కూరగాయల సలాడ్లు తినడానికి చాలామంది ఇష్టపడరు. దీనివల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ అందదు. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి, పేగులు శుభ్రపడటానికి ఫైబర్ ఎంతో అవసరం.
6. అతిగా టీ, కాఫీలు తాగడం..
చలి నుంచి ఉపశమనం కోసం రోజుకు నాలుగైదు సార్లు వేడివేడి టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. వీటిలోని కెఫిన్ మోతాదు ఎక్కువైతే కడుపులో ఆమ్లత్వం (Acidity) పెరగడమే కాకుండా, శరీరంలో డీహైడ్రేషన్‌కు, నిద్రలేమికి కూడా దారితీస్తుంది.
పొట్టను ఆరోగ్యంగా ఉంచుకునే సులభమైన చిట్కాలు..
నీటిని మరవద్దు: రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల వరకు గోరువెచ్చని నీటిని తాగేలా ప్లాన్ చేసుకోండి. సీజనల్ ఫుడ్.. క్యారెట్, ముల్లంగి, పాలకూర, జామకాయ, ఓట్స్, గోధుమ రవ్వ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్‌లో చేర్చుకోండి. బయట చలి ఎక్కువగా ఉంటే ఇంటి లోపలే లేదా ఎండ వచ్చిన తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేయండి.
ఆహారాన్ని తొందరగా కాకుండా బాగా నమిలి తినడం వల్ల సగం జీర్ణక్రియ నోటిలోనే పూర్తవుతుంది. అలాగే ప్రతిరోజూ ఒకే సమయా నికి భోజనం చేసేలా చూసుకోండి. నూనె, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలకు బదులుగా ఇంట్లో వండిన తేలికపాటి, వేడి ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..Tea Side effect : పరకడుపున టీ తాగితే జుట్టు ఎందుకు రాలుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
