Food safety : ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం.. ఎన్ని రోజులైతే డేంజర్..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో సమయం ఆదా చేసుకునేందుకు చాలామంది ఒకేసారి వంట చేసి ఫ్రిజ్‌లో పెట్టు కుంటారు. రెండు, మూడు రోజులు లేదా వారం రోజుల పాటు అదే ఆహారాన్ని వేడి చేసుకుని తింటుంటారు. ఫ్రిజ్‌లో పెడితే ఆహారం అస్సలు పాడవదని, ఎప్పుడైనా నిరభ్యంతరంగా తినవచ్చని చాలామంది నమ్ముతారు. కానీ, మీ ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతటి చేటు తెస్తుందో తెలుసా..? నిల్వ చేసిన వండిన ఆహారం, అందులో వృద్ధి చెందే బ్యాక్టీరియా, వాటివల్ల వచ్చే సమస్యలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

ఫ్రిజ్‌లోని ఆహారం పాడవదా..?

తక్కువ ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియా వృద్ధి చెందే వేగం తగ్గుతుందే తప్ప, అవి పూర్తిగా నశించిపోవు. వండిన ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోయినా, చాలా రోజుల పాటు అలాగే వదిలేసినా అందులో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఇలాంటి ఆహారం తింటే 'ఫుడ్ పాయిజనింగ్' అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

నిల్వ ఉంచిన ఆహారం తింటే వచ్చే సమస్యలు..

ఫుడ్ పాయిజనింగ్ ముప్పు..సరిగ్గా నిల్వ చేయని ఆహారంలో సాల్మొనెల్లా, లిస్టీరియా, ఈ-కొలి వంటి హానికరమైన బ్యాక్టీరియాలు చేరతాయి. వీటివల్ల తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం, నీరసం వంటి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపిస్తాయి.

జీర్ణవ్యవస్థపై ప్రభావం.. నిల్వ ఉంచిన ఆహారం తినడం వల్ల కడుపు, పేగుల్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదకరం. పేగుల్లో ఇన్ఫెక్షన్లు.. పాడైపోయిన ఆహారంలోని బ్యాక్టీరియా నేరుగా పేగుల్లోకి చేరి ఇన్ఫెక్షన్లకు (gastroenteritis)) కారణమవుతుంది. దీనివల్ల డయేరియా వంటివి వచ్చి పరిస్థితి తీవ్రమవుతుంది.

పదే పదే వేడి చేయొద్దు.. ఫ్రిజ్‌లోంచి తీసి వేడి చేయడం, మిగిలిన దాన్ని మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టడం.. ఈ ప్రక్రియను పదే పదే చేస్తే ఆహారం మరింత వేగంగా పాడవుతుంది. డీహైడ్రేషన్ ప్రమాదం..నిల్వ చేసిన ఆహారం వికటించి వాంతులు, విరేచనాలు కావడం వల్ల శరీరంలో నీటిశాతం, ఎలక్ట్రోలైట్స్ పడిపోయి తీవ్రమైన డీహైడ్రేషన్ బారిన పడతారు. ఒక్కోసారి ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.

ఏ ఆహారం.. ఎన్ని రోజులు నిల్వ ఉంచొచ్చు..?

ఫ్రిజ్ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు, పప్పులు, వండిన కూరగాయలు, అన్నం, వండిన చికెన్ లేదా మటన్ వంటివి సాధారణంగా 3 నుంచి 4 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఉడికించిన గుడ్లను వారం రోజుల పాటు, పచ్చి మాంసాన్ని 1-2 రోజుల పాటు నిల్వ చేయవచ్చు. అయితే, వండిన తర్వాత ఎంతసేపు బయట ఉంచారనే దానిపై ఈ వ్యవధి ఆధారపడి ఉంటుంది.

అన్నం విషయంలో మరింత జాగ్రత్త..!

వండిన అన్నాన్ని అలాగే గది ఉష్ణోగ్రత వద్ద వదిలేస్తే 'బాసిల్లస్ సిరియస్' (Bacillus cereus) అనే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. దీన్ని మళ్లీ వేడి చేసినా ఆ బ్యాక్టీరియా చనిపోదు. కాబట్టి, వండిన అన్నం మిగిలితే, అది చల్లారిన వెంటనే చిన్నచిన్న గిన్నెల్లోకి మార్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అలాగే, అన్నాన్ని పదే పదే వేడి చేయడం మానుకోవాలి.

ఎవరు అప్రమత్తంగా ఉండాలి..?

నిల్వ ఉంచిన, కలుషితమైన ఆహారం ఎవరికైనా హాని చేస్తుంది. కానీ చిన్న పిల్లలు, నవజాత శిశువులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.