వాయు కాలుష్యం తీస్తున్న ప్రాణాలు ఎన్ని?

షేర్ చేయండి:
వాయు కాలుష్యం తీస్తున్న ప్రాణాలు ఎన్ని?

సాక్షి లైఫ్: వాతావరణ కాలుష్యం కారణంగా ప్రపంచంలోనే అనేకులు విషతుల్యమైన గాలిని పీల్చాల్సి వస్తోంది.  ఫలితంగా ఆరోగ్య సమస్యలూ పెరిగిపోయి లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాయు కాలుష్యం వల్ల పక్షవాతం, గుండె సంబంధిత, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు తలెత్తుతున్నాయి. నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం.. సందర్భంగా సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం..  

కాలుష్య కోరల్లో.. 

పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు లేకపోయినా కొన్నిరకాల వ్యాధుల బారిన పడుతున్నారు కొందరు. దీనికి ప్రధాన కారణం కాలుష్యం. ప్రకృతి కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో స్వచ్ఛమైన గాలి తీవ్రంగా దెబ్బతింటోంది. దీంతో ప్రజలు పలురకాల వ్యాధులతో బాధపడుతున్నారు. మరికొందరు చనిపోతున్నారు. కాబట్టి ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకువచ్చి పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన..   

భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984లో డిసెంబర్ 2, 3 తేదీలలో జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వతేదీన జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  

గ్యాస్ లీక్ కావడంతో..

1984లో డిసెంబర్ 2, 3 తేదీల్లో రాత్రి సమయంలో, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి 40 టన్నుల ‘మిథైల్ ఐసోసైనేట్’ గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఐదువేలమందికిపైగా మృతి చెందారని అంచనా. 

2020లో సంవత్సరానికి 3.2 మిలియన్ల మరణాలకు గృహ వాయు కాలుష్యం కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఇందులో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 2లక్షల 37వేలమందికి పైగా మరణించినట్లు ఆయా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

ఢిల్లీ కాలుష్యం.. 

వాయు కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 6.7 మిలియన్ల మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ కాలుష్యం కారణంగా గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. దీనివల్ల లాక్ డౌన్ కూడా విధించాల్సి వచ్చింది. 

ఏ రకమైన కాలుష్యం మన శరీరానికి ఎలా హానికరం అనే దాని గురించి ప్రజలు తెలుసుకోవడం చాలా అవసరం. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ప్రధాన లక్ష్యం ఏమిటంటే..? పరిశ్రమలలో కాలుష్య రక్షణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ప్రజలు ఎలాంటి కాలుష్యాన్ని ఎదుర్కొవాలంటే ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి అనేది చాలా ముఖ్యం. 

"స్వచ్ఛమైన , ఆరోగ్యకరమైన గ్రహం కోసం స్థిరమైన అభివృద్ధి". అనేది జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం 2023 థీమ్.    

కాలుష్యాన్ని నివారించే మార్గాలు..  

పర్యావరణ అనుకూలమైన వస్తువులనే ఎంచుకోండి.
 మొక్కలు నాటండి.. పచ్చదనాన్ని పెంచండి.. 
వాతావరణకాలుష్యం పెరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే ఎక్కువగా వినియోగించాలి. 

ఇంట్లో తలుపులు, కిటికీలు మూసి ఉంచండి.
కాలుష్య ప్రాతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ఉపయోగించండి.
పటాకుల వినియోగాన్ని తగ్గించండి.

గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.