Symptoms of Prostate Cancer : ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : పురుషుల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో 'ప్రోస్టేట్ క్యాన్సర్' ఒకటి. దీని ప్రారంభ లక్షణాలు చాలా స్వల్పంగా ఉండటం వల్ల చాలామంది వయసు పైబడటం వల్లే ఇలా జరుగుతోందని పొరబడి, నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పురుషులు మూత్ర విసర్జనలో వచ్చే మార్పులను ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. సకాలంలో గుర్తిస్తే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి..?
పురుషుల్లో మూత్రాశయం (bladder) కింద ఉండే ఒక చిన్న గ్రంథినే ప్రోస్టేట్ అంటారు. ఇది వీర్యంలో ఉండే ద్రవ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథిలోని కణాలు అసాధారణంగా, అనియంత్రితంగా పెరిగినప్పుడు అది ప్రోస్టేట్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ప్రారంభ దశలో దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించక పోవచ్చు. అందుకే వయసు పైబడిన వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం.
ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి..
తరచుగా మూత్ర విసర్జన: పగలు లేదా రాత్రి సమయాల్లో సాధారణం కంటే ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, ముఖ్యంగా రాత్రి నిద్రలేచి మరీ ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంటే దానిని కేవలం వయసు ప్రభావంగా భావించకూడదు.
మూత్రం పోయడంలో ఇబ్బంది..
మూత్ర విసర్జన ప్రారంభించేటప్పుడు సమయం పట్టడం, ఇబ్బందిగా అనిపించడం లేదా ఎక్కువ ముక్కి పోయాల్సి రావడం ప్రోస్టేట్ గ్రంథిలో మార్పులకు సంకేతం కావచ్చు.
మూత్రం ధార తగ్గడం..
మూత్రం ధారగా కాకుండా సన్నగా రావడం లేదా మధ్యమధ్యలో ఆగిపోతూ వస్తుండటం కూడా ప్రోస్టేట్ సమస్యలను సూచిస్తుంది.
రక్తం పడటం..
మూత్రంలో లేదా వీర్యంలో రక్తం కనిపించడం అనేది సాధారణం కాదు. దీనికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు కానీ, ఇది అత్యంత తీవ్రమైన లక్షణంగా భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.
నడుము, కటి భాగంలో నొప్పి..
కటి (pelvic) ప్రాంతం, తుంటి లేదా నడుము కింది భాగంలో ఎడతెగని నొప్పి రావడం, విశ్రాంతి తీసుకున్నా తగ్గకపోవడం క్యాన్సర్ ముదిరిన దశను సూచిస్తుంది.
సకాలంలో పరీక్షలు ఎందుకు ముఖ్యం..?
క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. 50 ఏళ్లు పైబడిన పురుషులు లేదా కుటుంబంలో ప్రోస్టేట్ క్యాన్సర్ చరిత్ర (Family history) ఉన్నవారు వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు, PSA (Prostate-Specific Antigen) టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.
నివారణ, జాగ్రత్తలు..
తాజా పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య, పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగతాగడం, మితిమీరిన మద్యపానానికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. మూత్ర విసర్జనలో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే యూరాలజిస్ట్‌ను కలవాలి.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
