టూత్ బ్రష్ ఎన్నాళ్లకు మార్చాలి..?
సాక్షి లైఫ్ : చూడటానికి, తెల్లగా, గట్టిగా ఉండే దంతాలను సున్నితంగా సంరక్షించుకుంటే తప్ప అవి ఎక్కువ కాలం మనజాలవు. వీటి సంరక్షణ ఆవశ్యకత అర్థం కావాలంటే ముందు వాటి నిర్మాణం పై అవగాహన అవసరమ వుతుంది. దంతంపైభాగం ఎనామిల్ అనే పదార్థంతో ఏర్పడుతుంది. ఎనామిల్ తర్వాత డెంటిన్ అనే మరో పొర ఉంటుంది. డెంటిన్ తరువాత పల్ప్ కనిపిస్తుంది. ప్రతి దంతానికి దవడలో మూలం ఉంటుంది. ఎన్ని దంతాలుంటే అన్ని మూలాలు దవడ ఎముకలో ఉంటాయన్నమాట.
సిమెంట్ వలె..
ఈ దంతాల చుట్టూ చిగురు సిమెంట్ వలె పనిచేస్తుంది. చిగుళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే పన పండ్లు కూడా అంత గట్టిగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే వాచిపోయి దుర్వాసన వస్తుంది. ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి భరించలేని వాసన వస్తుంది. ఫలితంగా చాలామంది మనల్ని తప్పించుకుని తిరిగే ప్రమాదమూ ఉంటుంది. చిగుళ్ల వాపువల్ల రక్తస్రావం కూడా కలుగుతుంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే దంతాలు కదలడం ప్రారంభమవుతుంది.
ఇది కూడా చదవండి.. మధుమేహాన్ని నియంత్రించే అద్భుతమైన పండ్లు..
పుక్కిలించి ఊయడం..
దంతాలు వచ్చినా, రాకపోయినా శిశువులు పాలు తాగిన తర్వాత నోరంతా శభ్రంగా కడగాలి. వేలితో చిగుళ్లను మర్దన చేయాలి. పాల సీసా పీకను నోట్లోనే ఉంచి నిద్రపుచ్చకూడదు. ఏమైనా తిన్న తర్వాత పుక్కిలించి ఊయడం, నోటిని శుభ్రంగా కడుక్కోవడం వంటి పనులను పిల్లలకు అలవాటు చేయాలి. పిల్లలకు శాస్త్రీయంగా ఎలా పండ్లు తోమాలో తల్లిదండ్రులే దగ్గరుండి నేర్పించాలి. కిందిపండ్లు పైకి, పై పండు కిందికి బ్రష్ చేయాలి. పెద్దలు వాళ్ళు కూడా బ్రష్‌ని ప్రతి మూడు నెలలకోసారి మార్చాలి.
పెయిన్ బామ్స్..
పంటి నొప్పి లేదా చిగురు వాపు వస్తే దంతానికి పెయిన్ బామ్స్ వంటివి రాయకూడదు. పంటి సందుల్లో పుల్లలు, పిన్నీసులు వంటివి పెట్టి కెలకకూడదు. పాన్, గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తులను నమలకూడదు. గరుకైన పొడులను, గట్టిగా ఉండే బ్రష్‌లను దంతాలు శుభ్రంచేయడానికి ఉపయోగించకూడదు. అతి చల్లగా కానీ లేదా అతి వేడిగా ఉండే పదార్థాలను, పానీయాలను పంటికి తగలకుండా జాగ్రత్తపడితే మంచిది.
కంటి నరాలకు..
దంతాలకు వైద్యం చేయించు కుంటే చూపు మందగిస్తుందని చాలామంది అనుకుంటారు. ఇది పెద్ద అపోహ. పంటి నరాలకు, కంటి నరాలకు సంబంధమే లేదు. పండ్లు పుచ్చిపోవడానికి పురుగులు కారణం అనుకుంటారు. అది కూడా తప్పే. పండ్లు పుచ్చిపోవడానికి అసలు కారణం సూక్షజీవులే.
దంతాలను, చిగుళ్లను అన్ని వైపులా శుభ్రంచేసుకోక పోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. మనం తిన్న ఆహారం పండ్లలో ఇరుక్కుపోయి కుళ్లిపోయి దంత సమస్యలు వస్తాయి. అందుకే చిగుళ్లు వాయడం, రక్తంకారడం జరుగుతుంది. పళ్లు పుచ్చిపోవడం మరో సమస్య. పుచ్చడం ప్రారంభంలోనే గుర్తించి చికిత్స చేయించుకోవాలి. మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండకపోతే మరింత ప్రమాదం. కాబట్టి దంత సంరక్షణలో అవసరమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది కూడా చదవండి.. బీ అలర్ట్ : విటమిన్ డి టాబ్లెట్స్ వాడుతున్నారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
