రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

షేర్ చేయండి:
రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

సాక్షి లైఫ్: వేసవి కాలంలో ఎక్కువగా తీసుకునే పండ్లలో పుచ్చకాయ ఒకటి. అయితే మీ పుచ్చకాయ సహజంగా పండినదా లేదా ఏవైనా రసాయనాలతో కల్తీ చేశారా..? అనేది ఎప్పుడైనా గమనించారా.. ?
 అసలు రసాయనాలను ఉపయోగించి పండిన పుచ్చకాయ ఎలా గుర్తించాలి..?    

మారుతున్న కాలంతో పాటు మన జీవనశైలి మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రతిదానిలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. కూరగాయల నుంచి ధాన్యాలు, పండ్ల వరకు అన్నింటిలోనూ కల్తీ జరుగుతోంది. పుచ్చకాయ కూడా కల్తీ బారిన పడుతుందంటే నమ్మకం కలుగకపోవచ్చు. కానీ ఇది నిజం.. వేసవి కాలంలో ఎక్కువగా వినియోగించే పండ్లలో పుచ్చకాయలు ఒకటి. కానీ చాలా జ్యుసిగా, ఎర్రగా కనిపించే పుచ్చకాయలు సహజంగా పండినవా..? లేదా ఏవైనా రసాయనాలతో పండినవా..? అని మీరు ఎప్పుడైనా గుర్తించారా..? అదెలా అంటే..? 
 
ఎర్రరంగు ఎరిత్రోసిన్ వాడకం వల్లే..  
పుచ్చకాయలో ఉపయోగించే అత్యంత విషపూరితమైన రంగులలో ఎరిత్రోసిన్ ఒకటి. ఇది పింక్ కలర్ డై, ఇది ఆహారానికి రంగును జోడించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రమాదకరమైన కల్తీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక వీడియోను విడుదల చేసింది, దీనిలో మీరు పుచ్చకాయలో కల్తీని ఎలా గుర్తించవచ్చో తెలిపింది.

పుచ్చకాయను రెండు భాగాలుగా కట్ చేసి, దూది సహాయంతో గుజ్జుపై ఉన్న రంగును తనిఖీ చేయాలని వీడియోలో సూచించారు. దూది రంగు మారితే పండులో రసాయన రంగు కల్తీ అయినట్లు గుర్తించాలి. దూదికి అంటుకోకపోతే పుచ్చకాయ సహజంగా పండిందని అర్థం చేసుకోవాలి.  పుచ్చకాయను ఎర్రగా మార్చడానికి ఎరిత్రోసిన్ ను ఉపయోగిస్తున్నారు. ఇది శరీరంపై చాలా తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 

ఎరిత్రోసిన్ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఎరిత్రోసిన్ రసాయనం వల్ల రంగు కాయ రంగుఎర్రగా వస్తుంది. ఈ కెమికల్ తో థైరాయిడ్ పనితీరు దెబ్బతింటుందని, ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని ఓ అధ్యయనంలో తేలింది. రంగుతో పాటు, దాని రుచిని కూడా కృత్రిమంగా పెంచుతారు, దీని కోసం కార్బైడ్ అనే రసాయనాన్ని కలుపుతారు.

కార్బైడ్ వేసి.. 
కార్బైడ్ త్వరగా పండడానికి ఉపయోగిస్తారు..పండ్లలో కార్బైడ్‌ను సాధారణంగా వ్యాపారులు మాత్రమే ఉపయోగిస్తారు. వ్యాపారులు పండ్లను రైతుల నుంచి కొనుగోలు చేసి లాభాలు పొందేందుకు  వాటిని బలవంతంగా పండిస్తారు. పుచ్చకాయ కొనే సమయంలో దానిపై తెల్లటి పొడి కనిపిస్తే అది కార్బైడ్ అని గుర్తించాలి. మామిడిపండ్లు, అరటిపండ్లలో ఉపయోగించిన విధంగా పండ్లపై కార్బైడ్‌ని చూసినట్లయితే, వాటిని కోసే ముందు శుభ్రంగా కడిగి తినాలి, లేదంటే తీవ్రమైన వ్యాధుల బారీన పడే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.