Bone Health : మధుమేహం, థైరాయిడ్ ఉంటే బోన్ హెల్త్ కోసం ఏమి చేయాలి..?
సాక్షి లైఫ్ : మధుమేహం (Diabetes), థైరాయిడ్ (Thyroid) వ్యాధులు కేవలం రక్తంలో చక్కెరను, హార్మోన్లను మాత్రమే కాకుండా ఎముకలను కూడా లోపలి నుంచి దెబ్బతీస్తాయని తెలుసుకున్నాం. అయితే, ఈ వ్యాధులు ఉన్నప్పటికీ మనం తీసుకునే ఆహారం, పాటిస్తున్న జీవనశైలితో 'ఆస్టియోపోరోసిస్' అంటే ఎముకలు గుల్లబారడం అనే ముప్పును సులభంగా అడ్డుకోవచ్చు. ఈ వ్యాధులు ఉన్నవారు ఎముకలను పదిలంగా ఉంచుకోవడానికి వైద్య నిపుణులు సూచిస్తున్న మార్గాలు ఇవి..
రోజువారీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నియంత్రణే శ్రీరామరక్ష..మధుమేహ రోగులు రక్తంలో చక్కెర స్థాయి లను (HbA1c), థైరాయిడ్ ఉన్నవారు 'TSH' హార్మోన్ స్థాయిలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి. వ్యాధి కంట్రోల్లో ఉంటే ఎముకల క్షీణత దానంతట అదే ఆగిపోతుంది. మందుల వాడకంలో గ్యాప్: థైరాయిడ్ మాత్రలు ఉదయం పరగడు పున వేసుకున్న వెంటనే క్యాల్షియం సప్లిమెంట్లు వాడకూడదు. క్యాల్షియం, ఐరన్ మాత్రలు.. థైరాయిడ్ మందులు శరీరానికి వంటపట్టకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటి వాడకం మధ్య కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
కదిలిక ముఖ్యం..డయాబెటిస్, థైరాయిడ్ ముఖ్యంగా హైపోథైరాయి డిజం కారణంగా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అధిక బరువు వల్ల కీళ్లపై ఒత్తిడి పడుతుంది. దీన్ని నివారించడానికి రోజూ కనీసం 30-40 నిమిషాల పాటు నడక, తేలికపాటి యోగా లేదా డెన్సిటీ పెంచే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి.
క్రమం తప్పని పరీక్షలు..
50 ఏళ్లు పైబడిన వారు, ముఖ్యంగా మహిళలు ఏడాదికి ఒకసారి డాక్టర్ సలహాతో 'బోన్ డెన్సిటీ టెస్ట్' (DEXA Scan) చేయించుకోవడం ఉత్తమం. మధుమేహ రోగులు కిడ్నీల పనితీరు (KFT) కూడా గమనిస్తూ ఉండాలి.
పాటించాల్సిన ఆహార నియమాలు..
క్యాల్షియం కోసం..ఎముకలకు క్యాల్షియం ఎంతో ముఖ్యం. డయాబెటిస్ ఉన్నవారు వెన్న తీసిన పాలు, పెరుగు, పనీర్ వాడాలి. తెల్లటి అన్నానికి బదులుగా రాగులు, జొన్నలు, సజ్జలు వాడటం మంచిది. ముఖ్యంగా రాగులు, నువ్వుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ కూడా పెరగదు.
విటమిన్-డి కోసం ఎండ.. థైరాయిడ్, మధుమేహ రోగుల్లో విటమిన్-డి లోపం సాధారణంగా కనిపిస్తుంది. రోజూ ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య కనీసం 20 నిమిషాలు ఎండలో నిలబడాలి. ఆహారంలో గుడ్డు సొన, పుట్టగొడుగులు, తృణధాన్యాలు, ఆకుకూరలు పాలకూర, బ్రకోలీ వంటివి చేర్చుకోవాలి. సరిపడా ప్రోటీన్..కండరాలు బలంగా ఉంటేనే ఎముకలకు సపోర్ట్ ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు మొలకలు, పప్పు ధాన్యాలు, సోయా, గింజలు బాదం, వాల్ నట్స్, చేపలు లాంటి ఆరోగ్యకరమైన ప్రోటీన్ తీసుకోవాలి.
వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి..
కెఫిన్ పరిమితం..రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ, టీలు తాగకూడదు. కెఫిన్ ఎక్కువగా ఉంటే మూత్రం ద్వారా ఎముకల్లోని క్యాల్షియం బయటకు పోతుంది. ఉప్పు తగ్గించాలి..ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. ఉప్పు కూడా క్యాల్షియంను కరిగించేస్తుంది. పచ్చళ్లు, అప్పడాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో సోడియం అధికంగా ఉంటుంది. శీతల పానీయాలు వద్దు..కూల్ డ్రింక్స్, సోడాలు, బేక్ చేసిన పదార్థాలు బిస్కెట్లు, కేకులు, మైదా, స్వీట్లు పూర్తిగా మానేయాలి. ఇవి రక్తంలో చక్కెరను అమాంతం పెంచడమే కాకుండా ఎముకలను మరింత పెళుసుగా మారుస్తాయి.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
