Reduce Creatinine Levels : క్రియేటినిన్ స్థాయిలను తగ్గించుకోవడం ఎలా..?
సాక్షి లైఫ్ : మన శరీరంలోని రక్తాన్ని నిరంతరం శుద్ధి చేయడంలో కిడ్నీలు (Kidneys) కీలక పాత్ర పోషిస్తాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీల పనితీరు బాగుండటం అత్యంత ఆవశ్యకం. అయితే, మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే కిడ్నీ సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కిడ్నీల ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు వైద్యులు ప్రధానంగా సూచించే పరీక్ష 'క్రియేటినిన్' (Creatinine). రక్త పరీక్షలో క్రియేటినిన్ సాధారణ స్థాయిలో ఉంటే మీ కిడ్నీలు సురక్షితంగా ఉన్నట్లే. ఒకవేళ క్రియేటినిన్ స్థాయిలు పెరిగితే మాత్రం.. అది కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిందనడానికి సంకేతం కావచ్చు. అయితే, క్రియేటినిన్ పెరిగిన ప్రతిసారీ కిడ్నీలు పాడైనట్లు భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఇతర కారణాలు కూడా ఉంటాయి. అసలు క్రియేటినిన్ అంటే ఏమిటి..? అది ఎందుకు పెరుగుతుంది..? దానిని ఎలా అదుపు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
క్రియేటినిన్ అంటే ఏమిటి..?
మన శరీరంలోని కండరాలు పనిచేసేటప్పుడు సహజంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థమే ఈ 'క్రియేటినిన్'. ఆరోగ్యకరమైన కిడ్నీలు ఈ క్రియేటినిన్ను రక్తం నుంచి ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఎప్పుడైతే కిడ్నీల పనితీరు మందగిస్తుందో.. అప్పుడు రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ నెమ్మదించి, రక్తంలో క్రియేటినిన్ స్థాయిలు పెరిగిపోతాయి.
క్రియేటినిన్ పెరగడానికి ప్రధాన కారణాలు..
కేవలం కిడ్నీ వ్యాధుల వల్ల మాత్రమే కాకుండా, మన రోజువారీ అలవాట్లు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి. శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల క్రియేటినిన్ స్థాయిలు తాత్కాలికంగా పెరగొచ్చు. ఆహారపు అలవాట్లు.. మాంసాహారం ముఖ్యంగా రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇది పెరుగుతుంది.
జిమ్లో అధిక బరువులు ఎత్తుతూ, తీవ్రమైన వ్యాయామాలు (Heavy Workouts) చేసేవారిలో కండరాల కదలికల వల్ల క్రియేటినిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మధుమేహం (డయాబెటిస్), అధిక రక్తపోటు (హై బీపీ) అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. ఇష్టానుసారంగా వేసుకునే పెయిన్ కిల్లర్స్, నొప్పి నివారణ మాత్రలు, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ దీనికి కారణమవుతాయి.
క్రియేటినిన్ స్థాయిలను అదుపులో ఉంచుకునే మార్గాలు..
వైద్యుల సలహా మేరకు ప్రతిరోజూ తగిన మోతాదులో నీరు తాగాలి. అయితే కిడ్నీ, గుండె జబ్బులు ఉన్నవారు ద్రవ పదార్థాలు ఎంతమేర తీసుకోవాలో డాక్టర్ను అడిగి తెలుసుకోవాలి. ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించి, పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ అదుపులో ఉంచుకోవాలి. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో పెయిన్ కిల్లర్స్, హెర్బల్ సప్లిమెంట్స్ కొనుగోలు చేసి వాడకూడదు. రిస్క్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు తరచుగా సీరమ్ క్రియేటినిన్, eGFR, మూత్రంలో ఆల్బుమిన్ పరీక్షలు చేయించుకోవాలి.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?
రక్త పరీక్షలో క్రియేటినిన్ ఎక్కువగా వచ్చిన వెంటనే నెఫ్రాలజిస్ట్ ను సంప్రదించడం ఉత్తమం. ముఖ్యంగా.. మూత్రం రాకపోవడం లేదా బాగా తగ్గిపోవడం, కొద్దిపాటి పనికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఆయాసం రావడం, శరీరంలో ఆకస్మికంగా వాపులు ముఖ్యంగా ముఖం, కాళ్లపై రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
