Unexplained Weight Loss : కారణం లేకుండా బరువు తగ్గితే క్యాన్సర్‌కు సంకేతమా..? ఇతర వ్యాధుల లక్షణమా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అధిక బరువు, ఊబకాయం అనేవి మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు లాంటి ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని మనకు తెలుసు. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. బరువు తగ్గడం అనేది సాధారణంగా మంచి ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు సంకేతమే. అయితే, ఎలాంటి వ్యాయామం, డైటింగ్ చేయకుండానే అకారణంగా మీరు బరువు పడిపోతుంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే..! ఇది శరీరంలో పొంచి ఉన్న తీవ్రమైన వ్యాధులకు సూచిక కావచ్చు.

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

 

ఎలాంటి ప్రయత్నం చేయకుండానే వేగంగా బరువు తగ్గడాన్ని వైద్య పరిభాషలో 'అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్' (Unexplained weight loss) అంటారు. ఇది క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు సంకేతం కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు బరువు ఎందుకు తగ్గుతారో ఇక్కడ తెలుసుకుందాం.

క్యాన్సర్ లక్షణమా..?

క్యాన్సర్ బారిన పడినప్పుడు శరీరంలోని జీవక్రియల (metabolic processes) ప్రక్రియలో సమూల మార్పులు వస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లలో ఆకలి పూర్తిగా మందగిస్తుంది. మరికొన్ని క్యాన్సర్లు జీర్ణవ్యవస్థను దెబ్బతీసి, ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. వ్యాధి కారణంగా శరీరంలో వాపు ప్రక్రియలు పెరిగిపోయి, కండరాలు,కొవ్వు కరిగిపోతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, ఉదర, క్లోమ (Pancreas), పేగు క్యాన్సర్లలో 'బరువు తగ్గడం' అనేది ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది.

ఇతర కారణాలు ఏముంటాయి..?

అయితే, బరువు తగ్గడమంటే ప్రతిసారీ క్యాన్సర్ అని భయపడాల్సిన పనిలేదు. మరికొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతుంది:

1. డయాబెటిస్ (Diabetes)..

రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగా ఉండే డయాబెటిస్ రోగుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను కణాలు సరిగ్గా వినియోగించుకోలేనప్పుడు, శరీరం తనకు అవసరమైన శక్తి కోసం కండరాలు, ఫ్యాట్‌ను కరిగించడం ప్రారంభిస్తుంది. దీనివల్ల వేగంగా బరువు పడిపోతారు.

2. హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism)..

థైరాయిడ్ గ్రంథి మన శరీర జీవక్రియలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి పరిమితికి మించి హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దాన్ని 'హైపర్ థైరాయిడిజం' అంటారు. ఈ స్థితిలో శరీరంలో క్యాలరీలు చాలా వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా మీరు ఎంత బాగా తిన్నా సరే బరువు తగ్గిపోతుంటారు.

3. క్షయ వ్యాధి (tb)..

ఊపిరితిత్తులకు సోకే తీవ్రమైన ఇన్ఫెక్షన్ 'టీబీ' (Tuberculosis). ఈ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలం పాటు ఉండటం వల్ల ఆకలి తగ్గిపోయి, శరీరం క్రమంగా క్షీణిస్తుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?

బరువు తగ్గడంతో పాటు రెండు వారాలకు మించి ఆగని దగ్గు, తరచుగా జ్వరం, రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, తీవ్రమైన అలసట వంటివి ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

ఎలాంటి డైటింగ్, వర్కవుట్స్ చేయకుండానే.. ఆరు నుంచి పన్నెండు నెలల వ్యవధిలో మీ మొత్తం శరీర బరువులో 5 శాతానికి పైగా తగ్గితే వెంటనే డాక్టర్‌ను కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.