Osteoporosis : ఆస్టియోపోరోసిస్‌తో చిన్న దెబ్బకే ఫ్రాక్చర్ ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఎముకల పటుత్వం తగ్గుతోంది. 'ఆస్టియోపోరోసిస్' (Osteoporosis) బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం పట్ల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక 'సైలెంట్ కిల్లర్'. ఎముకలను లోపల నుంచి గుల్లగా మారుస్తుంది. ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా లేదా కిందపడినా ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. తొలిదశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల, తీవ్రత పెరిగే వరకు దీనిని గుర్తించడం కష్టంగా మారుతోంది.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?

 

భారత్‌లో పెరుగుతున్న ముప్పు..

దేశంలో యువత కూడా ఈ సమస్య బారిన పడుతుండటం గమనార్హం. జాతీయ స్థాయి వైద్య నివేదికల ప్రకారం.. ఆరోగ్యవంత మైన పురుషుల్లో కూడా సుమారు 14.6 శాతం మంది ఆస్టియోపో రోసిస్‌తో, 50.3 శాతం మంది ఆస్టియోపీనియా అంటే ఎముకల సాంద్రత తగ్గడంతో బాధపడుతున్నారు. ఇక మహిళల్లో దీని తీవ్రత మరింత ఎక్కువ. 8 నుంచి 62 శాతం మంది మహిళల్లో ఈ ముప్పు కనిపిస్తుండగా.. మెనోపాజ్ దాటిన వారిలో 30 నుంచి 33 శాతం మంది దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారిలో కీళ్ల నొప్పులు (arthritis), ఆస్టియోపోరోసిస్ ముప్పు అధికంగా ఉంటోంది.

కాలుష్యంతో ఎముకలకు ముప్పు ఎలా..?

సాధారణంగా వయసు పైబడటం, క్యాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయని మనకు తెలుసు. కానీ, పెరుగుతున్న వాయు కాలుష్యం కూడా ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్ఫ్లమేషన్ ముప్పు..గాలిలోని కాలుష్య కణాలు (PM 2.5, PM 10), విషవాయువులు శ్వాస ద్వారా శరీరంలోకి చేరి దీర్ఘకాలిక వాపు (Inflammation)కు దారితీస్తాయి. ఇది ఎముకలను అరిగేలా చేసే కణాలను (Osteoclasts) ప్రేరేపిస్తుంది.

ఫ్రీ రాడికల్స్..వాయు కాలుష్యం వల్ల ఎముకల కణజాలంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ పెరిగి, కొత్త ఎముకల నిర్మాణానికి ఆటంకం కలుగుతుంది. విటమిన్-డి శోషణకు అడ్డంకి..కాలుష్యం మూలంగా మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి, విటమిన్-డి జీవక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా తీసుకున్న ఆహారంలోని క్యాల్షియం ఒంటపట్టక ఎముకల సాంద్రత తగ్గిపోతుంది.

బలమైన ఎముకల కోసం ఏం చేయాలి..?

ఎముకల ఆరోగ్యంపై చిన్నప్పటి నుంచే దృష్టి పెట్టాలి. పౌష్టికాహారం, వ్యాయామంతో ఆస్టియోపోరోసిస్‌ను ముందుగానే అడ్డుకోవచ్చు. క్యాల్షియం అవసరం..పాలు, పెరుగు, పనీర్, రాగులు, నువ్వులు తదితర క్యాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. ఎండ తగలాలి..ఎముకలకు క్యాల్షియం పట్టాలంటే విటమిన్-డి అత్యవసరం. ఉదయం పూట లేత ఎండ శరీరానికి తగిలేలా చూసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడాలి.

నిత్య వ్యాయామం..రోజూ నడవడం, మెట్లు ఎక్కడం, కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. బోన్ డెన్సిటీ టెస్ట్..వయసు పైబడిన వారు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు వైద్యుల సలహాతో క్రమం తప్పకుండా 'బోన్ డెన్సిటీ టెస్ట్' (Bone Density Test) చేయించుకోవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.