Never Reheat These Foods : ఈ 7 పదార్థాలను అస్సలు మళ్లీ వేడి చేయకండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారిన జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పోషకవిలువలున్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. కానీ, సమయాభావం వల్ల వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి, మళ్లీ వేడి చేసుకుని (Reheat) తినే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఈ చిన్న తప్పు వల్ల ఆరోగ్యకరమైన ఆహారం కూడా విషతుల్యంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రొటీన్లు, నైట్రేట్లు ఎక్కువగా ఉండే కింది 7 పదార్థాలను పొరపాటున కూడా మళ్లీ వేడి చేయకూడదు. అవేంటో ఇక్కడ చూద్దాం..

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

 

మళ్లీ వేడి చేయకూడని 7 పదార్థాలు ఇవే..

1. ఆకుకూరలు.. 

పాలకూరతో పాటు ఇతర ఆకుకూరల్లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వండిన ఆకుకూరలను మళ్లీ వేడి చేయడం వల్ల ఆ నైట్రేట్లు కాస్తా విషపూరిత సమ్మేళనాలుగా (Toxic compounds) మారుతాయి. ఇది శరీరానికి తీవ్ర హాని చేస్తుంది. కాబట్టి ఆకుకూరలను ఎప్పటికప్పుడు తాజాగా వండుకుని తినడమే మేలు.

2. అన్నం.. 

మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీ వేడి చేసుకుని తినడం మన ఇళ్లలో సర్వసాధారణం. కానీ, వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచితే 'బాసిల్లస్ సెరియస్' అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీన్ని మళ్లీ వేడి చేసినా ఫుడ్ పాయిజనింగ్ ముప్పు పొంచే ఉంటుంది. అందువల్ల మిగిలిన అన్నాన్ని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టుకుని, అవసరమైనంత వరకే వేడి చేసుకోవాలి.

3. గుడ్లు..

ప్రొటీన్‌కు కేరాఫ్ అడ్రస్ గుడ్డు. అయితే ఉడికించిన లేదా వండిన గుడ్లను మళ్లీ వేడి చేయడం వల్ల అందులోని ప్రొటీన్ నిర్మాణం దెబ్బతింటుంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా వీటిని నిల్వ ఉంచి మళ్లీ వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది.

4. మాంసాహారాలు..

చికెన్‌లో కూడా ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. దీన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులోని ప్రొటీన్ల అమరిక పూర్తిగా మారిపోతుంది. ఇలాంటి మాంసాన్ని తింటే జీర్ణక్రియ మందగిస్తుంది, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. మాంసాహారాన్ని వండిన వెంటనే తినేయడం ఉత్తమం.

5. బంగాళదుంప..

బంగాళదుంపలను వండిన తర్వాత ఎక్కువసేపు గది ఉష్ణోగ్రత వద్ద బయట ఉంచితే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. వీటిని సరైన పద్ధతిలో నిల్వ చేయకుండా మళ్లీ వేడి చేసి తినడం వల్ల కడుపునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

6. పుట్టగొడుగులు.. 

మష్రూమ్స్‌లో ఉండే ప్రొటీన్లు చాలా త్వరగా పాడైపోతాయి. వండిన వెంటనే వీటిని తినేయాలి. మళ్లీ వేడి చేయడం వల్ల అందులోని ప్రొటీన్లు విషతుల్యంగా మారి తీవ్రమైన జీర్ణ, ఉదర సంబంధిత సమస్యలకు దారితీస్తాయి.

7. నూనెలో వండిన పదార్థాలు..

నూనెలో డీప్ ఫ్రై చేసిన లేదా ఎక్కువ నూనెతో వండిన పదార్థాలను పదే పదే వేడి చేయడం వల్ల నూనె నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది. దీనివల్ల క్యాన్సర్ కారకమైన ప్రమాదకర పదార్థాలు (trans fats) ఉత్పత్తి అవుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తీవ్ర ముప్పు.

ఆహారాన్ని నిల్వ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు..  

బయట ఉంచకండి..వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ముఖ్యంగా వేసవిలో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో భద్రపరచండి..మిగిలిపోయిన ఆహారాన్ని వండిన రెండు గంటలలోపు ఫ్రిజ్‌లో భద్రపరచాలి. పదే పదే వేడి వద్దు..ఆహారాన్ని పదే పదే వేడి చేసే అలవాటు మానుకోవాలి. మీకు ఎంత అవసరమో అంతే మేర తీసుకుని వేడి చేసుకోవాలి. పూర్తిగా వేడి చేయాలి.. ఒకవేళ వేడి చేయాల్సి వస్తే, అందులో ఉండే బ్యాక్టీరియా నశించేలా ఆహారాన్ని లోపలి వరకు పూర్తిగా వేడి చేయాలి. సగం సగం వేడి చేసి తినడం ప్రమాదకరం.

 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.