Dental problems : పయోరియాతో జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే దంతాలు ఊడిపోవచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మీకు పళ్లు తోముకునేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా..? నోటి నుంచి తరచూ దుర్వాసన కూడా వస్తోందా..? వీటిని సాధారణ దంత సమస్యలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఇవి 'పయోరియా' (Pyorrhea) అనే తీవ్రమైన వ్యాధికి సంకేతాలు కావచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. చాలామంది దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, వైద్య పరిభాషలో 'పెరియోడాంటైటిస్' (Periodontitis) అని పిలిచే ఈ పయోరియా ముదిరితే, దంతాలతో పాటు వాటికి ఆధారంగా ఉండే దవడ ఎముకలకు, కణజాలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. నోటి ఇన్ఫెక్షన్లు కేవలం దంతాలకే పరిమితం కాకుండా, దీర్ఘకాలంలో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలకూ దారితీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..? 

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

 

అసలు పయోరియా అంటే ఏమిటి..? లక్షణాలు ఎలా ఉంటాయి..?


దంతాల చుట్టూ ఉండే చిగుళ్లు, ఎముకలకు సోకే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ను పయోరియా అంటారు. ఇది దంతాల నుంచి క్రమంగా చిగుళ్లకు వ్యాపించి వాటిని బలహీనపరుస్తుంది. ప్రారంభ దశలో దీని లక్షణాలు చాలా స్వల్పంగా ఉండటం వల్ల చాలామందికి ఈ వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదు.

మీరు గమనించాల్సిన ప్రధాన లక్షణాలు.. 

రక్తస్రావం..బ్రష్ చేస్తున్నప్పుడు లేదా గట్టి పదార్థాలు కొరుకుతున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం. వాపు, దుర్వాసన..చిగుళ్లు ఎర్రగా మారి వాపు రావడం, నిరంతరం నోటి నుంచి దుర్వాసన రావడం. ఖాళీలు ఏర్పడటం..చిగుళ్లు కిందకు జారిపోయి, దంతాలకు,చిగుళ్లకు మధ్య ఖాళీలు ఏర్పడటం. నొప్పి, కదలడం..నమిలేటప్పుడు నొప్పిగా అనిపించడం, దంతాలు వదులుగా మారి కదలడం.

ఈ సమస్య ఎందుకు వస్తుంది..?

నోటి శుభ్రత లోపించడం..పయోరియాకు ప్రధాన కారణం ఇదే. దంతాలు, చిగుళ్లపై జిగురు లాంటి బ్యాక్టీరియా పొర పేరుకుపోయి, గట్టిపడటం వల్ల ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. ధూమపానం, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు నమిలే అలవాటు ఉన్నవారిలో ఈ ముప్పు ఎక్కువ.

ఇతర ఆరోగ్య సమస్యలు..

మధుమేహం అదుపులో లేకపోవడం, విటమిన్-సి లోపం, రోగనిరోధక శక్తి తగ్గడం, హార్మోన్లలో మార్పులు వంటివి పయోరియాకు దారితీయవచ్చు. క్రమం తప్పకుండా బ్రష్ చేయకపోవడం, దంతాల మధ్య దారంతో శుభ్రం చేసే 'ఫ్లాసింగ్' అలవాటు లేకపోవడం.

నివారణ, చికిత్స మార్గాలు.. 

దంత సమస్యలను ముందే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చు. చిగుళ్ల నుంచి రక్తం కారడం లేదా పళ్లు కదలడం గమనించిన వెంటనే డెంటిస్ట్‌ను సంప్రదించాలి.  వైద్యులు 'స్కేలింగ్', 'రూట్ ప్లానింగ్' విధానాల ద్వారా పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగించి, అవసరమైన మందులు సూచిస్తారు.

రోజూ రెండుసార్లు బ్రషింగ్..

ఫ్లోరైడ్ ఉండే టూత్‌పేస్ట్‌తో ఉదయం, రాత్రి పడుకునే ముందు.. ఇలా రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా పళ్లు తోముకోవాలి. ఫ్లాసింగ్ ద్వారా దంతాల సందుల్లోని ఆహారపు కణాలను తొలగించాలి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని పుక్కిలించడం వల్ల చిగుళ్ల వాపు, ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడతాయి. ఏ సమస్యా లేకపోయినా ప్రతి ఆరు నెలలకోసారి దంత వైద్యుడిని కలిసి చెకప్ చేయించుకోవడం ఎంతో ఉత్తమం. నోటి ఆరోగ్యమే మహాభాగ్యం. సరైన జాగ్రత్తలు పాటిస్తే పయోరియాను అరికట్టి, మీ చిరునవ్వును కలకాలం కాపాడుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.