నోటి ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు-వాస్తవాలు..
సాక్షి లైఫ్ : మానవ శరీరానికి నోటి ఆరోగ్యం కూడా ప్రధానమైందే. నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే ఆ ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపై తీవ్రంగా ఉంటుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అటువంటి వాటిలో చిగుళ్ల వ్యాధి, దంత క్షయం వంటి నోటి ఆరోగ్యసమస్యలు గుండె జబ్బులు, మెటబాలిక్ సిండ్రోమ్, పల్మనరీ డిజార్డర్స్, అధిక బరువు, కిడ్నీ సమస్యలు, మధుమేహం ప్రమాదాన్నిపెంచుతాయని పలు అధ్యయనాల్లో తేలింది.
వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్బంగా..
నోటి ఆరోగ్యానికి సంబంధించి చాలామందికి అనేక రకాల అపోహలు ఉంటూ ఉంటాయి. అటువంటి వాటిలో కొన్నిటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. దంతాలు,చిగుళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయినప్పటికీ ఓరల్ హెల్త్ ను మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఓరల్ హెల్త్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈరోజు వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్బంగా నోటి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని అపోహలు, వాస్తవాలను గురించి తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. రెయిన్‌బో బేబీ అంటే ఏమిటి..?
అపోహ :దంతాలు తెల్లగా ఉంటేనే ఆరోగ్యకరమైనవా..?
వాస్తవం: నిజం ఏమిటంటే తెల్లటి దంతాలు తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉండవు. పంటి ఎనామెల్ తెలుపు రంగులో ఉంటుంది. డెంటిన్ అంటే దంతాల లోపలి భాగం పసుపు రంగులో ఉంటుంది. మీ ఎనామెల్ సన్నగా ఉంటే లేదా కొన్ని కారణాల వల్ల తొలగిపోయినట్లయితే, మీ దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి.
అపోహ : చిన్నపిల్లలు పళ్ళు తోముకోవాల్సిన అవసరం లేదా...?
వాస్తవం: చిన్న పిల్లలకు దంతాలు వచ్చిన తర్వాత రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. పిల్లల దంతాలు సరిగా శుభ్రం చేయకపోతే పిప్పి పళ్లు వచ్చే ప్రమాదం ఉంది. అవి దీర్ఘకాలంలో వారి ఆరోగ్యానికి తీవ్రంగా హాని కలిగిస్తాయి. కాబట్టి దంతాలు శుభ్రం చేసుకోవడం చాలా అవసరం.
అపోహ : దంతాలను వేగంగా,ఎక్కువసేపు బ్రష్ చేస్తున్నారా..?
వాస్తవం: మీరు మీ దంతాలను చాలా వేగంగా బ్రష్ చేస్తే లేదా రోజుకు చాలా సార్లు బ్రష్ చేస్తే, అది మీ దంతాలను హాని కలిగించే అవకాశం ఉంది. అంతేకాదు ఎనామిల్, చిగుళ్ళను దెబ్బతినడం వల్ల తినాలన్నా, తాగాలన్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
అపోహ: చిగుళ్ల వ్యాధి తీవ్రమైనది కాదా..?
వాస్తవం: చిగుళ్ల వ్యాధి అనేది నోటికి మాత్రమే పరిమితమైన వ్యాధి కాదు. చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. చిగుళ్ల వ్యాధి గుండె జబ్బులు, మధుమేహంతోపాటు అనేక రకాల క్యాన్సర్లకు కారణమవుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి.. ఫాస్టింగ్ కు గుండె జబ్బులకు లింక్ ఏంటి..? రీసెర్చ్ లో వెల్లడైన షాకింగ్ నిజాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
