ఆరోగ్య చిట్కాలు: మండే ఎండల్లో వేడిని నివారించడానికి ఇలా చేయండి..
సాక్షి లైఫ్ : ఇక నెమ్మదిగా రోజురోజుకీ ఎండలు పెరుగుతున్నాయి. చలి తగ్గి ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. కాబట్టి వేసవికాలంలో ఎండ దెబ్బతగలకుండా ఉండాలంటే సరైన ఆహారపు అలవాట్లు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని చెబుతున్నారు. ఆరోగ్యం విషమిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని డాక్టర్లు చెబుతున్నారు. మండే ఎండనుంచి రక్షించుకోవడానికి ఎలాంటి నివారణాచర్యలు అనుసరించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో బయటకు వెళ్లాల్సి వచ్చినా పూర్తి ప్రిపరేషన్‌తో వెళ్లండి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినండి, నీటితోపాటు వీలైనంత ఎక్కువ ద్రవాలను తీసుకోండి. పిల్లలు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని పగటిపూట ఇంటి నుంచి బయటకు రానివ్వవద్దు.
సన్ స్ట్రోక్..
తలనొప్పి, జ్వరం, వాంతులు, అధిక చెమట, మూర్ఛ, బలహీనంగా అనిపించడం, పల్స్ రేటు పడిపోవడం వంటి సమస్యలు ఉంటే"సన్ స్ట్రోక్" ,"ఎండదెబ్బ", లేదా "వడదెబ్బ" గా భావించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే, రోగిని నీడ ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టాలి. అనంతరం అతనికి ద్రవఆహారం అందించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
రోజంతా తాజాగా..
అధిక బరువు ఉన్న మధుమేహ రోగులు రెండు చెంచాల బార్లీ నీళ్లను తీసుకోవాలి. దీంతో శరీరం రోజంతా తాజాగా ఉంటుంది. అల్పాహారానికి ముందు దోసకాయ, పుచ్చకాయ మొదలైనవి తినండి. అరగంట తరువాత, తేలికపాటి, పోషకమైన , జీర్ణమయ్యే అల్పాహారం తీసుకోండి. ఒకటి లేదా రెండు గంటల వ్యవధికి ఓసారి నీరు తాగుతూ ఉండండి.
కారంగా ఉండే ఆహారం..
ఖాళీ కడుపుతో ఎండలో ఎప్పుడూ బయటకు వెళ్లవద్దు. ఎల్లప్పుడూ శుభ్రమైన నీటిని మీతో ఉంచుకోండి, మీకు దాహం అనిపించినప్పుడు వెంటనే తాగండి. ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు మాత్రమే తీసుకోండి. ఎండలు పెరిగేటప్పుడు కారంగా ఉండే ఆహారాన్ని మానుకోవడం మంచిది.
నేరుగా ఎండలోకి వెళ్లవద్దు..
ఎయిర్ కండిషన్డ్ రూమ్ నుంచి నేరుగా ఎండలోకి వెళ్లవద్దు. ఎండనుంచి కూడా డైరెక్ట్ గా ఏసీ రూమ్ లోకి వెళ్ళకూడదు. ఇంటి నుంచి బయలుదేరే ముందు పుష్కలంగా నీరు తాగాలి. కాటన్ దుస్తులు, వదులుగా, సౌకర్యవంతమైన బట్టలు ధరించి మాత్రమే బయటకు వెళ్లండి.
టోపీ, లేదా గుడ్డ, లేదా గొడుగుతో మీ తలను ఎండలో కప్పి ఉంచండి. నీరు, మజ్జిగ, ఓఆర్ ఎస్ ద్రావణం, ఇంట్లో తయారుచేసిన లస్సీ, నిమ్మరసం వంటివి తీసుకుంటూ ఉండండి.
అసురక్షిత పానీయాలు..
రోడ్డు పక్కన విక్రయించే కట్ చేసిన పండ్లు, అసురక్షిత పానీయాలు ,కృత్రిమ స్వీట్లనుఅస్సలు తినవద్దు. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు చల్లటి నీరు తాగకూడదు. ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోండి.
ఇది కూడా చదవండి.. చిన్నారులకు పారాసిటమాల్ వేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
