మంచినీళ్లు ఎక్కువగా తాగితే మంచిదా..? కాదా..?
సాక్షి లైఫ్ : ప్రతిరోజూ నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ఏదైనా పరిమితికి మించితే ఇబ్బందే..అంటున్నారు డాక్టర్లు.
శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు రోజూ తగినంత మంచినీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ, అతిగా మంచినీరును తాగడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఒక స్థాయికి మించి మంచినీరు తాగడం వల్ల శరీరంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం..!
సోడియం స్థాయిలు..
అతిగా మంచినీరు తాగడం వల్ల పొత్తి కడుపు నొప్పి, శరీర అవయవాల వాపు లేదా పొత్తి కడుపు అమాంతం పెరిగిపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. దీంతో పాటు శరీరం డీహైడ్రేట్ అవ్వడం వల్ల సోడియం స్థాయిలు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుందని పరిశోధనల్లో తేలింది.
ప్రమాదకర దశ..
అలా సోడియం స్థాయి తగ్గడం కారణంగా మెదడలో మంట ఏర్పడే అవకాశం ఉంది. ఇది ప్రమాదకర దశ. దీన్ని వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది. శరీరంలో తగినంత నీరు ఉంటే, ఎక్కువ నీరు తాగవలసిన అవసరం లేదు.
రోజుకు రెండు నుంచి నాలుగు లీటర్ల నీరు సరి పోతుంది. శరీరం తగినంతగా హైడ్రేట్ అయిందా లేదా నిర్జలీకరణంగా ఉందా లేదా అనేది ఈ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
చర్మం పొడిబారడం..
శరీరంలో నీరు లేకపోవడం వల్ల మన చర్మం పొడిబారడం, పెదవులు ఎండిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. శరీరంలో నీరు లేకపోవడం వల్ల ఛాతీలో కొంచెం మంట, ఆమ్లత్వం లేదా కడుపులో అసౌకర్యం ఏర్పడవచ్చు.
తలనొప్పి..
శరీరంలో నీటి కొరత ఏర్పడడం వల్ల కండరాలలో నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల నిరంతరం తలనొప్పి వస్తుంటుంది. శరీరంలో తగిన మోతాదులో నీరు లేకపోతే తగినంత లాలాజల ఉత్పత్తి జరగదు. దీని వల్ల నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.
లాలాజల ఉత్పత్తి..
లాలాజల ఉత్పత్తి తగ్గితే నోటిలో బ్యాక్టీరియా సంఖ్య పెరిగి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. మూత్రం రంగు కాలక్రమేణా ముదురు లేదా పసుపు రంగులోకి మారినట్లయితే, అది డీహైడ్రేషన్ కు సంకేతం.
ఈ లక్షణాలు ఉన్న వారు రోజువారీ తాగే నీటి మోతాదును కాస్త పెంచాల్సిన అవసరం ఉంది. అలాంటి సమస్యలు లేని వారు రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగితే సరిపోతుంది. ప్రతిరోజూ నీరు ఎంత తాగాలనే విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
