Nocturia : నాక్టూరియా అంటే ఏమిటి..? ఇదేమైనా ప్రాణాంతకమా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రాత్రి నిద్రలో ఒకసారి మూత్ర విసర్జనకు లేవడం సాధారణమే. కానీ, పదే పదే మెలకువ వచ్చి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటే మాత్రం దాన్ని కేవలం 'నీళ్లు ఎక్కువగా తాగాం కదా' అని తేలికగా తీసుకోకూడదు. దీనివల్ల నిద్ర నాణ్యత దెబ్బతిని, ఉదయం లేచేసరికి తీవ్రమైన అలసట, నీరసం ఆవరిస్తాయి. వైద్య పరిభాషలో ఈ సమస్యను 'నాక్టూరియా' (Nocturia) అంటారు. రాత్రిపూట తరచూ మూత్ర విసర్జన సమస్య వెనుక కేవలం నీళ్లు తాగడం మాత్రమే కాదు, శరీరంలో జరుగుతున్న అనేక మార్పులు, అనారోగ్య సమస్యలు కారణం కావొచ్చు. అవేమిటో తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

1. పడుకునే ముందు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం..

నిద్రకు ఉపక్రమించే ముందు నీళ్లు, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల సహజంగానే మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా కెఫిన్ ఉండే పానీయాలు మూత్రవిసర్జనను ప్రేరేపిస్తాయి. నిద్రకు రెండు మూడు గంటల ముందే ద్రవ పదార్థాలు తీసుకోవడం తగ్గించడం మంచిది.

2. మధుమేహం (Diabetes Risk) ముప్పు..

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం ఆ అదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుంది. దీనివల్ల తరచూ మూత్రం వస్తుంది. విపరీతమైన దాహం, అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే తప్పకుండా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.

3. పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలు..

వయసు పైబడిన పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి వాపు రావడం సర్వసాధారణం. దీనివల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడి పూర్తిగా ఖాళీ అవ్వకపోవడం, మూత్రం ధారగా రాకపోవడం లేదా రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

4. మూత్రనాళ ఇన్ఫెక్షన్ (UTI)..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడూ మూత్ర విసర్జన చేయాలనే భావన కలుగుతుంది. మూత్రం పోసేటప్పుడు మంట, నొప్పి, దుర్వాసన రావడం, కొన్నిసార్లు జ్వరం రావడం జరుగుతుంది. ఇలాంటప్పుడు సొంత వైద్యం మానుకుని డాక్టర్‌ను సంప్రదించాలి.

5. కాళ్ల వాపులు (Edema)..

పగటిపూట కాళ్లలో పేరుకుపోయిన అదనపు ద్రవాలు, రాత్రి పడుకున్నప్పుడు తిరిగి రక్త ప్రవాహంలోకి, కిడ్నీల వైపు చేరుకుంటాయి. అప్పుడు కిడ్నీలు ఆ ద్రవాన్ని ఫిల్టర్ చేయడం వల్ల రాత్రిపూట మూత్రం ఎక్కువగా వస్తుంది. కాళ్లలో ఎప్పుడూ వాపులు ఉంటుంటే కారణాన్ని అన్వేషించాలి.

6. మందుల ప్రభావం..

అధిక రక్తపోటు లేదా ఇతర సమస్యల కోసం వాడే కొన్ని రకాల మందుల అంటే డైయూరిటిక్స్,వాటర్ పిల్స్ వల్ల శరీరం నుంచి అదనపు నీరు, ఉప్పు బయటకు వెళ్తాయి. కొత్త మందులు వాడటం మొదలుపెట్టాకే ఈ సమస్య వస్తుంటే వైద్యుల సలహాతో మందులు వేసుకునే సమయాన్ని మార్చుకోవాలి.

7. నిద్ర సంబంధిత సమస్యలు..

చాలాసార్లు మూత్రం రావడం వల్ల నిద్ర చెడదు, నిద్ర సరిగా పట్టక లేదా స్లీప్ ఆప్నియా వల్ల మెలకువ వస్తుంది. అలా మెలకువ వచ్చిన ప్రతిసారీ అలవాటుగా మూత్రానికి వెళ్తుంటారు. ఈ నిద్ర లేమికి సరైన కారణం కనుక్కోవాలి.

వైద్యుడిని ఎప్పుడు కలవాలి అంటే..?

వరుసగా కొన్ని వారాల పాటు మీ నిద్రకు ఆటంకం కలుగుతున్నా, మూత్రంలో రక్తం పడినా, మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట, భరించలేని నొప్పి ఉన్నా తక్షణమే వైద్యులను సంప్రదించాలి. వారి సలహా మేరకు బ్లడ్ షుగర్, యూరిన్ టెస్ట్ చేయించుకుని సరైన చికిత్స తీసుకోవాలి.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.