Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..
సాక్షి లైఫ్ : చలికాలం రాగానే చల్లని గాలులతో పాటు రకరకాల సీజనల్ వ్యాధులు కూడా దాడి చేస్తుంటాయి. ఈ వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడంతో పాటు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకు మన రోజువారీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చలికాలంలో కచ్చితంగా మన డైట్లో ఉండాల్సిన కొన్ని 'సూపర్ ఫుడ్స్' ఉన్నాయి. విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండే ఇవి మన శరీరానికి అద్భుతమైన పోషణను అందిస్తాయి. మార్కెట్లో చాలా సులభంగా, చౌకగా దొరికే ఈ ఆహార పదార్థాలను ఇప్పటి నుంచే మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
1. ఉసిరి (Amla)..
చలికాలంలో ఉసిరికాయ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి (oxidative stress) నుంచి శరీరాన్ని రక్షించి, రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.
ఎలా తీసుకోవాలి మరి..? ఉసిరికాయను పచ్చిగా తినొచ్చు. లేదా ఉసిరి జ్యూస్, పచ్చడి, సలాడ్ల రూపంలో కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.
2. బెల్లం (Jaggery)..
చలికాలంలో బెల్లం తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఇందులో ఐరన్, శరీరానికి అవసరమైన ఇతర మినరల్స్ ఉంటాయి. అయితే, పంచదార లాగానే బెల్లం కూడా తీపి పదార్థమే కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారు దీన్ని మితంగానే తీసుకోవాలి.
ఎలా తీసుకోవాలి..? భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తినొచ్చు. లేదా నువ్వులు, పల్లీలతో కలిపి లడ్డూలు చేసుకుని తినడం చాలా మంచిది.
3. నువ్వులు (Sesame Seeds)..
చలికాలంలో విరివిగా వాడే మరో సూపర్ ఫుడ్ నువ్వులు. వీటిలో కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి, శరీర సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
ఎలా తీసుకోవాలి: నువ్వుల లడ్డూ, నువ్వుల చిక్కీ రూపంలో తీసుకోవచ్చు. లేదా కూరలు, సలాడ్లలో వేయించిన నువ్వుల పొడిని చల్లుకుని తినొచ్చు.
4. సజ్జలు (Pearl Millet)..
చలికాలంలో కచ్చితంగా తినాల్సిన పోషకభరితమైన తృణధాన్యం సజ్జలు. వీటిలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, బరువును నియంత్రణలో ఉంచుతాయి.
ఎలా తీసుకోవాలి: సజ్జ రొట్టెలు, కిచిడీ లేదా సజ్జ జావ రూపంలో తీసుకోవచ్చు. వీటిని ఆకుకూరలు, పప్పు లేదా పెరుగుతో కలిపి తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుంది.
5. ఆకుకూరలు (Green Leafy Vegetables)..
చలికాలంలో పాలకూర, మెంతికూర, బచ్చలి, ఆవకూర ఆకులు వంటి ఆకుకూరలు మార్కెట్లో విరివిగా, తాజాగా దొరుకుతాయి. వీటిలో విటమిన్ ఏ, సి, కె, ఫోలేట్, ఐరన్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.
ఎలా తీసుకోవాలి మరి..? వీటిని పప్పులో వేసి వండుకోవడం, సూప్స్ చేసుకోవడం లేదా ఇతర కూరగాయలతో కలిపి వండుకుని మీ రోజువారీ భోజనంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
