AIIMS Scientists’ Research : పురుషుల్లో సంతానలేమి సమస్యలకు ‘యోగా’తో చెక్.. ఎయిమ్స్ శాస్త్రవేత్తల పరిశోధనలో కీలక విషయాలు..!
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో లోపాలు నేడు అనేకమంది దంపతులను సంతానలేమి సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతుండగా.. అందులో దాదాపు 50 శాతం కేసుల్లో పురుష భాగస్వాముల్లోని లోపాలే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. వీర్యకణాల సంఖ్య తగ్గడం, కణాల చలనశీలత (Motility) లోపించడం, డీఎన్‌ఏ దెబ్బతినడం వంటి సమస్యలతో సతమతమవుతున్న పురుషులకు దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా పురుషులలో వంధ్యత్వ సమస్యలను సమర్థవంతంగా అధిగమించవచ్చని ఎయిమ్స్ వైద్యుల బృందం తాజా అధ్యయనంలో వెల్లడించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా'లో ప్రచురితమైన ఈ నివేదిక బాధితుల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
ఎయిమ్స్ అధ్యయనం ఏం చెబుతోంది..?
ఎయిమ్స్ బయోమెడికల్ విభాగ నిపుణులు డాక్టర్ రీమా దాదా, డాక్టర్ రాజీవ్ కుమార్, ప్రభాకర్ తివారీ, అంజలి యాదవ్‌లతో కూడిన బృందం ఈ ప్రత్యేక పరిశోధన చేపట్టింది. సంతానలేమి సమస్య ఎదుర్కొంటున్న 25 నుంచి 40 ఏళ్ల వయసు గల 78 మంది పురుషులపై ఈ అధ్యయనం నిర్వహించారు.
వీరిలో 42 మందికి దాదాపు 12 వారాల పాటు..వారానికి 5 రోజులు, ప్రతిరోజూ ఒక గంట పాటు.. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం (Meditation) వంటి ప్రత్యేక యోగా ప్రక్రియల్లో శిక్షణ ఇచ్చారు. మూడు నెలల అనంతరం వారిలో ఆశ్చర్యకరమైన సానుకూల మార్పులను శాస్త్రవేత్తలు గుర్తించారు.
యోగాతో కలిగే ప్రయోజనాలు ఇవే..
ఆక్సీకరణ ఒత్తిడి (Oxidative Stress) తగ్గడం.. ఒత్తిడి, కాలుష్యం కారణంగా శరీరంలో పెరిగే ఫ్రీ-రాడికల్స్ వీర్యకణాల నాణ్యతను దెబ్బతీస్తాయి. యోగా చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి, శరీరంలో యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం పెరుగుతుంది.
డీఎన్‌ఏ నాణ్యత పెంపు.. వీర్యకణాల్లోని ‘డీఎన్‌ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్’ (DFI - డీఎన్‌ఏ దెబ్బతినే తీవ్రత) యోగా సాధన వల్ల గణనీయంగా తగ్గినట్లు పరిశోధనలో తేలింది.
రక్తప్రసరణ మెరుగుదల.. నిరంతర ఆసనాల వల్ల పునరుత్పత్తి అవయవాలకు రక్తప్రసరణ పెరిగి, మైటోకాండ్రియా పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా వీర్యకణాల చలనశీలత వృద్ధి చెందుతుంది.
కనీసం ఆరు నెలలు అవసరం..!
"శరీరంలో అంతర్గతంగా కణాల రక్షణ వ్యవస్థ బలపడటానికి, డీఎన్‌ఏ నాణ్యతలో స్పష్టమైన మార్పులు రావడానికి కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం అవసరం. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు (Side effects) లేని, మందులతో పనిలేకుండా జీవనశైలిని మార్చుకునే అత్యుత్తమ మార్గం."-డాక్టర్ రీమా దాదా, ఎయిమ్స్ పరిశోధకులు.
ధూమపానం, మద్యపానం, ఊబకాయం, ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని ఎక్కువసేపు పనిచేయడం వంటి అలవాట్లకు దూరంగా ఉంటూ.. నిత్యం యోగాను జీవితంలో భాగం చేసుకుంటే సంతానలేమి సమస్యలను సులభంగా జయించవచ్చని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్న దంపతులకు ఈ ప్రకృతిసిద్ధమైన జీవనశైలి వ్యూహం ఎంతో మేలు చేకూరుస్తుంది.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
