Insurance Premiums : అవసరానికి మించి బీమా ప్రీమియం చెల్లిస్తున్నారా..? ఇలా సరిచూసుకోండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆర్థిక భద్రత కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, భవిష్యత్తుకు పూర్తి భరోసా ఉండాలనే ఆరాటంలో చాలామంది అవసరానికి మించి పాలసీలు కొనుగోలు చేస్తుంటారు. కాలక్రమేణా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్.. ఇలా ఏజెంట్లు లేదా బ్యాంకుల ద్వారా తీసుకున్న రకరకాల పాలసీలు పేరుకుపోతాయి. ఏటా లేదా ప్రతి నెలా వీటికి భారీగా ప్రీమియం చెల్లిస్తుంటారు. కానీ, నిజంగా ఈ పాలసీలన్నీ తమకు అవసరమా అని సమీక్షించుకునే వారు చాలా తక్కువ. అవసరానికి మించి బీమా తీసుకోవడం అదనపు భద్రతను ఇవ్వకపోగా, ఒకే రకమైన రిస్క్ కవరేజీ కోసం మళ్లీ మళ్లీ డబ్బులు వెచ్చించేలా చేస్తుంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా బీమా పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

ముందుగా పాలసీల జాబితా సిద్ధం చేసుకోండి.. 

మీరు 'ఓవర్ ఇన్సూర్డ్' అంటే అవసరానికి మించి బీమా కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా మీ వద్ద ఉన్న పాలసీలన్నింటితో ఒక జాబితా తయారు చేయండి. ఆఫీసులో ఇచ్చినవి, బ్యాంకులు లేదా ఏజెంట్ల ద్వారా తీసుకున్నవి, ఆన్‌లైన్‌లో కొన్నవి.. ఇలా అన్నింటినీ అందులో చేర్చండి. ప్రతి పాలసీకి సంబంధించిన బీమా మొత్తం, ప్రీమియం, కాలపరిమితి, మినహాయింపులు వంటి వివరాలు రాసుకోండి. దీనివల్ల రెండు మూడు పాలసీలు ఒకే రకమైన కవరేజీని ఇస్తున్నాయేమో సులభంగా గుర్తించవచ్చు.

హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవరేజీల ఓవర్‌ల్యాప్..

హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో ఒకే రకమైన కవరేజీ తరచుగా కనిపిస్తుంటుంది. ఒకరి పేరిట ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉండటం తప్పు కాదు కానీ, క్లెయిమ్ సమయంలో ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. 'ఇండెమ్నిటీ' ఆధారిత హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఆసుపత్రిలో అయిన వాస్తవ ఖర్చును మాత్రమే చెల్లిస్తారు. అంటే మీ దగ్గర ఎన్ని పాలసీలు ఉన్నప్పటికీ, చికిత్సకు అయిన ఖర్చు కంటే అదనంగా డబ్బులు రావు.

జీవిత బీమా.. కవరేజీ అవసరాన్ని గుర్తించండి..

లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో పాలసీల సంఖ్య కన్నా, మొత్తం కవరేజీ ఎంత ఉందనేది ముఖ్యం. చాలామంది చిన్న మొత్తాలకు అనేక సంప్రదాయ పాలసీలు తీసుకుంటారు, కానీ కుటుంబ ఆర్థిక అవసరాలకు సరిపడా కవరేజీ మాత్రం ఉండదు. మరోవైపు, హోమ్ లోన్ తీరిపోయి, పిల్లలు స్థిరపడిన తర్వాత కూడా కొందరు పాత ప్రీమియంను అలాగే కొనసాగిస్తుంటారు. ఆర్థిక బాధ్యతలు తగ్గినప్పుడు అంత పెద్ద కవరేజీకి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గమనించాలి.

రైడర్స్, యాడ్ ఆన్స్ ఎంపికలో ఆచితూచి..

క్రిటికల్ ఇల్‌నెస్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, హాస్పిటల్ క్యాష్ వంటి 'రైడర్స్' కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బాగా ఉపయోగపడతాయి. అలాగని అందుబాటులో ఉన్న ప్రతి యాడ్ ఆన్‌ను తీసుకుంటే ప్రీమియం భారం అమాంతం పెరిగిపోతుంది. ఆ కవరేజీకి తగ్గట్టుగా మీ ఆర్థిక భద్రత పెరుగుతుందన్న గ్యారెంటీ కూడా ఉండదు. కాబట్టి, మీకు నిజంగా అవసరమైన రైడర్లను మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం.

 గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..

మీ వద్ద ఉన్న అన్ని బీమా పాలసీల జాబితా రాసుకుని, వాటి ప్రయోజనాలను ఒకదానితో ఒకటి పోల్చి చూడండి. ఒకే రకమైన ప్రమాదం లేదా కవరేజీ కోసం రెండు, మూడు పాలసీలకు ప్రీమియం కడుతున్నారేమో సరిచూసుకోండి.

వివాహం, పిల్లలు పుట్టడం లేదా హోమ్ లోన్ తీసుకోవడం వంటి జీవితంలో కొత్త బాధ్యతలు పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు మీ కవరేజీని కచ్చితంగా సమీక్షించుకోండి. పాత పాలసీని రద్దు చేసి కొత్తది తీసుకునే ముందు, కొత్త పాలసీలోని నిబంధనలు, వెయిటింగ్ పీరియడ్ వంటి పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదివి తెలుసుకోవాలి.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.