Tips for Soft and Smooth Lips : మృదువైన పెదవుల కోసం చిట్కాలు ..!
సాక్షి లైఫ్ : వాతావరణంలో మార్పుల ప్రభావం ముందుగా కనిపించేది మన పెదవుల పైనే. పెదవులు పొడిబారడం, పగలడం వల్ల ముఖ సౌందర్యం తగ్గడమే కాకుండా.. ఒక్కోసారి నొప్పి, మంట, అసౌకర్యం కలుగుతాయి. శరీరంలో నీటి శాతం తగ్గడం, పదేపదే పెదవులను నాలుకతో తడపడం, ఎండ ప్రభావం, పోషకాల లోపం వంటి అనేక కారణాల వల్ల పెదవులు తమ సహజసిద్ధమైన తేమను కోల్పోతాయి. దీనికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన లిప్ బామ్స్, కాస్మెటిక్స్ వాడినా ఫలితం తాత్కాలికంగానే ఉంటుంది. అయితే, మన వంటగదిలో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టొచ్చు. మృతకణాలను తొలగించి, పెదవులకు సహజమైన తేమను అందించే ఆ అద్భుతమైన చిట్కాలు ఏమిటో చూద్దాం..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
పెదవులను మృదువుగా మార్చే 5 సింపుల్ టిప్స్..
తేనె ఒక అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెదవుల పగుళ్లను తగ్గించి, తేమను నిలుపుతాయి. రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన తేనెను పెదవులకు రాసుకుని, 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కావాలంటే రాత్రంతా అలాగే ఉంచుకోవచ్చు. రోజూ ఇలా చేస్తే పెదవులు మృదువుగా మారతాయి.
కొబ్బరి నూనె మసాజ్..
కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్లు మెండుగా ఉంటాయి. ఇవి పొడిబారిన పెదవులకు ప్రాణం పోస్తాయి. రోజులో రెండు, మూడు సార్లు రెండు చుక్కల కొబ్బరి నూనెను తీసుకుని పెదవులపై అప్లై చేయాలి. ఇది పగుళ్ల సమస్యను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.
నెయ్యితో నిగారింపు..
పెదవుల సంరక్షణ కోసం స్వచ్ఛమైన దేశవాళీ నెయ్యిని వాడటం మనకు ఎప్పటినుంచో ఉన్న అలవాటే. రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా నెయ్యి తీసుకుని పెదవులపై సున్నితంగా మసాజ్ చేయాలి. దీనివల్ల పొడిబారే సమస్య తగ్గి, పెదవులకు సహజమైన మెరుపు వస్తుంది.
అలోవెరా జెల్..
చర్మానికి చలువ చేయడంలో, తేమను అందించడంలో అలోవెరా ముందుంటుంది. తాజా కలబంద గుజ్జును తీసుకుని పెదవులకు రాసి, 10 నుంచి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అయితే, అలోవెరా పడని వారు ,అలర్జీ ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
చక్కెర, తేనెతో సున్నితమైన స్క్రబ్..
పొడిబారిన పెదవులపై పేరుకుపోయిన మృతకణాలను (Dead Skin) తొలగించడానికి ఇది బెస్ట్ స్క్రబ్. ఒక చెంచా చక్కెరలో కొద్దిగా తేనె కలిపి, పెదవులపై ఒకట్రెండు నిమిషాల పాటు సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత కడిగేసి, కొబ్బరి నూనె లేదా లిప్ బామ్ రాసుకోవాలి. ఈ స్క్రబ్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి.
ఈ అలవాట్లతో పెదవులకు రక్షణ..
పెదవులు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, గులాబీ రంగులో మెరిసిపోవాలంటే ఈ కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. రోజంతా శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. పెదవులను పదేపదే నాలుకతో తడిపే అలవాటును మానుకోవాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఎస్పీఎఫ్ (SPF) ఉన్న లిప్ బామ్‌ను ఉపయోగించాలి. విటమిన్ 'బి', ఐరన్ పుష్కలంగా ఉండే పోషకాహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి. రాత్రి పడుకునే ముందు ముఖంతో పాటే పెదవులకు కూడా మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు.
ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు..
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
