Cobalamin : శాకాహారుల్లో విటమిన్ బి-12 లోపం ఎందుకు ఎక్కువ..? ముందస్తుగా ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : రోజూ ఇంట్లో వండిన తాజా ఆహారమే తింటున్నాం కదా, శరీరానికి అన్ని పోషకాలూ అందుతున్నాయనుకుంటే పొరపాటే. ప్రస్తుతం మన దేశంలో అత్యధికులను వేధిస్తున్న ప్రధాన పోషకాహార లోపాల్లో 'విటమిన్ బి-12' ఒకటి. ముఖ్యంగా శాకాహారులు, వీగన్ డైట్ పాటించేవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోందని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. శరీరంలో నాడులు చురుగ్గా పనిచేయడానికీ, ఎర్ర రక్తకణాలు సక్రమంగా ఉత్పత్తి కావడానికీ ఈ విటమిన్ అత్యంత కీలకం.
విటమిన్ బి-12 ప్రాధాన్యం ఏమిటి..?
శరీరంలో డీఎన్ఏ తయారీతో పాటు మెదడు, నాడీ వ్యవస్థల పనితీరు సజావుగా సాగడానికి విటమిన్ బి-12 (cobalamin) తోడ్పడుతుంది. రక్తహీనత నివారణ.. ఎముక మజ్జలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు రూపుదిద్దుకోవడానికి ఇది చాలా అవసరం. దీని లోపం ఏర్పడితే రక్తకణాల పరిమాణం అసాధారణంగా పెరిగి ‘మెగాలోబ్లాస్టిక్ అనీమియా’కు దారితీస్తుంది. నాడీ వ్యవస్థ సంరక్షణ..నరాల చుట్టూ ఉండే రక్షణ పొర (Myelin Sheath) దెబ్బతినకుండా కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
లోపం తలెత్తితే కనిపించే లక్షణాలు..
శరీరంలో బి-12 స్థాయిలు తగ్గినప్పుడు ప్రారంభంలోనే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. రాత్రి తగినంత నిద్రపోయినా ఉదయం లేవగానే ఒంట్లో శక్తి లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలతిరగడం.
నరాల బలహీనత కారణంగా అరిచేతులు, అరికాళ్లలో తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్లు అనిపించడం లేదా స్పర్శ తగ్గడం. నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం, కండరాల బలహీనత. నాలుకపై మార్పులు.. నాలుక ఎర్రగా మారడం, మంట, నోటి పూత. జ్ఞాపకశక్తి తగ్గడం..ఏకాగ్రత కుదరకపోవడం, మతిమరుపు, మానసిక ఆందోళన లేదా చిరాకు.
శాకాహారుల్లోనే ఈ లోపం ఎందుకు ఎక్కువ..?
విటమిన్ బి-12 సహజసిద్ధంగా మొక్కల ఆధారిత ఆహారాల్లో లభించదు. ఇది ప్రధానంగా జంతు సంబంధిత ఆహారాల్లోనే ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారికి ఆహారం ద్వారా బి-12 అందే మార్గాలు చాలా పరిమితం.
అయితే కేవలం ఆహారమే కాకుండా శరీరంలో దీని శోషణ (Absorption) సరిగ్గా జరగకపోవడం కూడా లోపానికి మరో కారణం. జీర్ణకోశ సమస్యలు ఉన్నవారిలో, పెద్ద వయస్కులలో, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యల కోసం దీర్ఘకాలంగా మందులు వాడేవారిలో ప్రేగులు ఈ విటమిన్ను పూర్తిగా గ్రహించలేవు.
లోపాన్ని అధిగమించడం ఎలా..?
పాల ఉత్పత్తులు: శాకాహారులు రోజూ తగిన మోతాదులో పాలు, పెరుగు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవాలి. గుడ్లు తినేవారైతే రోజూ ఒక గుడ్డు తీసుకోవడం మంచిది. ఫోర్టిఫైడ్ ఆహారాలు.. మార్కెట్లో లభించే బి-12 ఫోర్టిఫైడ్ సెరల్స్, సోయా మిల్క్ లేదా బాదం పాలు ఎంచుకోవచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి రక్తంలో సీరం విటమిన్ బి-12 స్థాయిలను పరీక్షించుకోవాలి. లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల పర్యవేక్షణలో మాత్రలు లేదా ఇంజెక్షన్ల ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
