Fitness Without Gym : జిమ్‌కి వెళ్లకుండానే ఫిట్‌నెస్‌..! : రోజూ ఈ వాకింగ్ ప్లాన్స్‌ పాటిస్తే చాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండాలంటే ఖరీదైన జిమ్‌లకు వెళ్లి బరువులు ఎత్తాల్సిందేనని చాలామంది భావిస్తుంటారు. అయితే నిత్యజీవితంలో నడకను సరైన పద్ధతిలో భాగం చేసుకుంటే ఎలాంటి పరికరాల అవసరం లేకుండానే చక్కటి ఫిట్‌నెస్‌ సొంతమవుతుంది. శరీర బరువును అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపకరించే 7 రకాల వాకింగ్ ప్లాన్లు ఇవీ...

1. బ్రిస్క్ వాకింగ్..

సాధారణ వేగం కంటే కాస్త వేగంగా అడుగులు వేయడాన్ని బ్రిస్క్ వాకింగ్ అంటారు. రోజూ 25 నుంచి 30 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది జీవక్రియల రేటును పెంచడంతో పాటు గుండె కండరాలను బలోపేతం చేసి శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 

2. ఇంటర్వెల్ వాకింగ్..

ఈ పద్ధతిలో నడక వేగాన్ని మారుస్తూ సాధన చేయాలి. మొదట 2 నిమిషాలు సాధారణ వేగంతో నడవాలి. ఆ వెంటనే తర్వాతి 1 నిమిషం వేగాన్ని బాగా పెంచి బ్రిస్క్ వాక్ చేయాలి. ఇదే విధంగా వరుసగా 20 నుంచి 25 నిమిషాల పాటు పునరావృతం చేయడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ కొవ్వు కరుగుతుంది.

3. మార్నింగ్ వాక్..

ఉదయం వేళ స్వచ్ఛమైన గాలిలో 30 నుంచి 40 నిమిషాలు నడవడం వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందుతుంది. ఇది రోజంతా ఉల్లాసంగా, చురుగ్గా పనిచేసేందుకు అవసరమైన శక్తిని అందించడమే కాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

4. స్టెప్ కౌంట్ వాకింగ్..

రోజుకు ఇన్ని అడుగులు వేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 8,000 నుంచి 10,000 అడుగులు వేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం స్మార్ట్‌వాచ్ లేదా మొబైల్ ఫిట్‌నెస్ యాప్‌ల సహాయం తీసుకోవచ్చు.

5. నేచర్ వాక్..

పార్కులు, చెట్లు ఎక్కువగా ఉండే పచ్చని వాతావరణంలో 20 నుంచి 30 నిమిషాలు గడపడం మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. పచ్చదనం మధ్య నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.

6. ఈవెనింగ్ వాక్..

రాత్రి భోజనం పూర్తయిన వెంటనే పడుకోకుండా 10 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవాలి. దీనివల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటాయి.

7. ఇంక్లైన్ వాకింగ్..

ఫ్లాట్ నేలపై కాకుండా మెట్లు ఎక్కడం లేదా చిన్నపాటి ఎత్తైన రోడ్లపై నడవడం ఇంక్లైన్ వాకింగ్ పరిధిలోకి వస్తుంది. ఇలా ఎత్తుపైకి నడవడం వల్ల పిక్కలు, తొడ కండరాలు పటిష్ఠమవుతాయి. సాధారణ నడకతో పోలిస్తే ఇందులో రెట్టింపు కేలరీలు ఖర్చవుతాయి. క్రమం తప్పకుండా చేసే చిన్న ప్రయత్నమే పెద్ద మార్పునకు నాంది. రోజూ కనీసం అరగంట కేటాయించి ఈ వాకింగ్ పద్ధతుల్లో ఒకదానిని దినచర్యలో భాగం చేసుకుంటే జిమ్‌లకు వెళ్లకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.