Fatty Liver : ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా..? ఉదయం అల్పాహారంలో వీటితో జాగ్రత్త..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం తీసుకునే టిఫిన్ రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. అయితే, మనం ఆరోగ్యకరమైనవని భావించి తీసుకునే కొన్ని అల్పాహారాలు కాలేయ ఆరోగ్యానికి చేటు తెచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా 'ఫ్యాటీ లివర్' సమస్యతో బాధపడేవారు చక్కెరలు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, వేపుళ్లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనం తరచూ తినే ఏయే పదార్థాల విషయంలో జాగ్రత్త వహించాలో, వాటిని ఎలా ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చో తెలుసుకుందాం.. 

ఈ అల్పాహారాల పట్ల అప్రమత్తత అవసరం..

1. కేవలం అటుకులు మాత్రమే తినడంఅటుకులు జీర్ణానికి తేలికైనవే అయినప్పటికీ, కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే అధికంగా ఉండేలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. 

చేయాల్సిన మార్పు.. అటుకుల్లో బఠానీలు, క్యారెట్ వంటి కూరగాయలు, తగినంత వేరుశనగలు జోడించాలి. దీనితో పాటు ప్రొటీన్ కోసం ఒక కప్పు పెరుగు లేదా ఉడికించిన గుడ్డును జతచేసుకుంటే సంపూర్ణ పోషకాహారంగా మారుతుంది.

2. సూజీ రవ్వ ఉప్మా..తెలుగువారి ఇళ్లలో ఉప్మా సాధారణ టిఫిన్. అయితే తెల్లటి బొంబాయి రవ్వతో చేసే ఉప్మాలో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు కాలేయంలో కొవ్వు చేరడానికి కారణమవుతాయి.

చేయాల్సిన మార్పు.. బొంబాయి రవ్వకు బదులుగా గోధుమ రవ్వ లేదా మిల్లెట్స్ ఎంచుకోవాలి. ఇందులోనూ బీన్స్, క్యారెట్ వంటి కూరగాయ ముక్కలను ఎక్కువగా వేసి చేసుకోవడం మంచిది.

3. వైట్ బ్రెడ్, బటర్, జామ్త్వరగా అయిపోతుందని చాలామంది బ్రెడ్-జామ్ తింటుంటారు. మైదాతో చేసిన బ్రెడ్, కృత్రిమ చక్కెరలు నిండిన జామ్, వెన్న కలయిక ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఏమాత్రం మంచిది కాదు.

చేయాల్సిన మార్పు.. మైదా బ్రెడ్‌కు బదులుగా 100శాతం ముడి ధాన్యాల బ్రెడ్ ఎంచుకోవచ్చు. చక్కెర ఉండే జామ్‌కు బదులుగా చక్కెర లేని పీనట్ బటర్ లేదా ఉడికించిన గుడ్డును ఎంపిక చేసుకోవడం మేలు.

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

4. టీతో పాటు బిస్కెట్లు, రస్క్..ఉదయం లేవగానే టీతో రెండు బిస్కెట్లు లేదా రస్క్ తీసుకోవడం తేలికైన విషయంగా అనిపించవచ్చు. కానీ మైదా, అనారోగ్యకరమైన నూనెలు, అధిక చక్కెర ఉండే బిస్కెట్లలో ప్రొటీన్, ఫైబర్ శూన్యం. ఇది లివర్ ఆరోగ్యానికి హానికరం.

చేయాల్సిన మార్పు..వీలైనంత వరకు చక్కెర తగ్గించిన గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. బిస్కెట్లకు బదులుగా గుప్పెడు నానబెట్టిన బాదం లేదా వాల్‌నట్స్ తీసుకోవడం మంచిది.

5. ప్యాకేజ్డ్ కార్న్‌ఫ్లేక్స్, తీపి సీరియల్స్ త్వరగా తయారవుతుందని పిల్లల నుంచి పెద్దల వరకు ప్యాక్ చేసిన కార్న్‌ఫ్లేక్స్ వాడుతుంటారు. వీటిలో దాగి ఉండే అదనపు చక్కెరలు కాలేయంపై భారాన్ని పెంచుతాయి. 

చేయాల్సిన మార్పు.. మార్కెట్లో దొరికే తీపి పదార్థాల కంటే ఇంట్లో వండుకునే రోల్డ్ ఓట్స్ లేదా జొన్న, రాగి అంబలి వంటివి ఉత్తమం. వీటిలో తాజా పండ్ల ముక్కలు, చియా గింజలు చేర్చుకుంటే పీచు పదార్థం అందుతుంది. 

ఫ్యాటీ లివర్ ఉన్నవారి టిఫిన్ ప్లేట్ ఎలా ఉండాలి..? 
 
సమతుల్యత ముఖ్యం.. ప్లేట్‌లో పిండి పదార్థాలు తక్కువగా, ప్రొటీన్, ఫైబర్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఎంపికలు..పెసరట్టు, వెజిటబుల్ ఓట్స్, ఉడకబెట్టిన గుడ్లు, మొలకెత్తిన గింజలు (Sprouts.), చిరుధాన్యాల ఇడ్లీలు కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.చక్కెర, నూనె పరిమితం.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర పదార్థాలను దూరం పెట్టి సహజసిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాలేయాన్ని కాపాడుకునే ఉత్తమ మార్గం.

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.