Health care : తరచూ వేళ్లు విరుచుకుంటున్నారా..? అసలు టక్ టక్ శబ్దం ఎందుకొస్తుందో తెలుసా..!
సాక్షి లైఫ్ : ఖాళీగా కూర్చున్నప్పుడు లేదా కాస్త అలసటగా అనిపించిన ప్పుడు వేళ్లు విరవడం (Finger Cracking) చాలామందికి ఉండే అలవాటు. ఇలా చేసిన తర్వాత చేతులు కాస్త తేలికపడినట్లు, ఉపశమనంగా అనిపిస్తుంటుంది. అయితే, వేళ్లు విరిచినప్పుడు 'టక్.. టక్.. మని శబ్దం ఎందుకు వస్తుంది..? ఇది ఏదైనా ఆరోగ్య సమస్యకు సంకేతమా..? ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎముకలు, కీళ్లు బలహీనపడతాయా..? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. దీని వెనక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వేళ్లు విరిచినప్పుడు శబ్దం ఎందుకొస్తుంది..?
మన కీళ్ల మధ్యలో కదలికలు సులభంగా, రాపిడి లేకుండా ఉండటం కోసం 'సైనోవియల్ ద్రవం' (Synovial fluid) ఉంటుంది. ఇది కీళ్లకు లూబ్రికెంట్‌గా పనిచేస్తుంది. మనం వేళ్లను లాగినప్పుడు లేదా వంచినప్పుడు, కీళ్ల లోపల ఉన్న ఒత్తిడిలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. ఆ సమయంలో ద్రవంలో ఏర్పడే గ్యాస్ బుడగలు పగలడం వల్లే మనకు ఆ చప్పుడు వినిపిస్తుంది. ఒక్కసారి ఈ బుడగలు పగిలిన తర్వాత, కీలు లోపలి పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఒకసారి విరిచిన వేలును వెంటనే మళ్లీ విరిస్తే శబ్దం రాదు.
వేళ్లు విరిస్తే ఆర్థరైటిస్ అంటే కీళ్లవాతం వస్తుందా..?
వేళ్లు విరవడం వల్ల భవిష్యత్తులో ఆర్థరైటిస్ వస్తుందనేది చాలామందిలో ఉన్న అతిపెద్ద అపోహ. కానీ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, సాధారణంగా వేళ్లు విరవడానికి, కీళ్లవాతానికి మధ్య ఎలాంటి సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు. చేతుల్లో నొప్పి, వాపు వంటి ఇతర అనారోగ్య సమస్యలు లేకుండా.. కేవలం వేళ్లు విరిచే అలవాటు ఉన్నంత మాత్రాన ఆర్థరైటిస్ వస్తుందని భయపడాల్సిన పనిలేదు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
మరి ఇది ప్రమాదకరమా..?
సాధారణంగా వేళ్లు విరుచుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కానీ, శబ్దం రావాలని బలవంతంగా, ఎక్కువ ఒత్తిడితో వేళ్లను విరిస్తే మాత్రం సున్నితమైన కణజాలాలకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. వేళ్లు విరిచినప్పుడు నొప్పి వచ్చినా, వాపు కనిపించినా లేదా కీలు కదపడంలో ఇబ్బందిగా అనిపించినా ఆ అలవాటును వెంటనే మానుకోవడం మంచిది.
ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు..?
కేవలం శబ్దం మాత్రమే వచ్చి, ఎలాంటి నొప్పి లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, వేళ్లు విరిచే అలవాటు ఉన్నవారిలో కింది లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించాలి.
వేళ్లలో నిరంతర నొప్పి లేదా కీళ్ల వద్ద వాపు రావడం.
ఉదయం లేవగానే వేళ్లు బిగుసుకుపోవడం లేదా జాయింట్లలో పట్టివేసినట్లు అనిపించడం. వేలును పూర్తిగా వంచడానికి లేదా చాపడానికి ఇబ్బంది పడటం. వేలు కదుపుతున్నప్పుడు మధ్యలో లాక్ అయినట్లు అనిపించడం. గతంలో ఏదైనా గాయం అయిన తర్వాత నుంచి కీళ్లలో తరచుగా శబ్దాలు రావడం. కీళ్ల చుట్టూ చర్మం ఎర్రబడటం లేదా తాకినప్పుడు వెచ్చగా అనిపించడం.
ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?
ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
