Tattoos : ట్యాటూ వేయించుకున్న వారికి ఈ ముప్పు తప్పదా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత రోజుల్లో యువతలో పచ్చబొట్ల (tattoos) క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. తమ ఇష్టాలను, భావోద్వేగాలను, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఫ్యాషన్ కోసం శరీరంలోని వివిధ భాగాలపై ట్యాటూలు వేయించుకుంటున్నారు. అయితే కేవలం స్టైల్ కోసం ఆరాటపడుతూ పరిశుభ్రత, భద్రతలను గాలికొదిలేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్యాటూలు వేసేందుకు ఉపయోగించే సూదులు, ఇతర పరికరాలు క్రిమిరహితం (Sterilize) చేయనివి అయితే ఇన్ఫెక్షన్ల ముప్పు పొంచి ఉంటుంది. అసలు ట్యాటూల వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?  

 

ట్యాటూతో వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి..?

ట్యాటూ వేసే ప్రక్రియలో చర్మం పైపొరను సూదితో గుచ్చుతూ సిరాను (Ink) లోపలికి పంపుతారు. ఈ క్రమంలో చర్మంపై చిన్నచిన్న గాయాలు అవుతాయి. సూది, వాడే పరికరాలు లేదా ట్యాటూ వేసే ప్రదేశం అపరిశుభ్రంగా ఉంటే, ఆ గాయాల ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

పొంచి ఉన్న తీవ్రమైన వ్యాధులు..

హెపటైటిస్ బి, సి (Hepatitis B & C)..

కలుషితమైన రక్తం ద్వారా ఈ వ్యాధులు వ్యాపిస్తాయి. ఒకరికి వాడిన సూదిని సరైన విధంగా శుభ్రం చేయకుండా మరొకరికి వాడటం వల్ల ఈ వైరస్‌లు సోకుతాయి. ఇవి కాలేయం (Liver) పై తీవ్ర ప్రభావం చూపి, దీర్ఘకాలంలో ప్రాణాంతక సమస్యలకు దారితీస్తాయి.

హెచ్‌ఐవీ (HIV) ముప్పు..

 ట్యాటూ వేసేందుకు వాడిన సూదికి ఏమాత్రం హెచ్‌ఐవీ సోకిన రక్తం అంటి ఉన్నా.. అదే సూదిని మరొకరికి వాడినప్పుడు రక్తనాళాల ద్వారా ఈ ప్రాణాంతక వైరస్ సోకే ప్రమాదం ఉంది.

చర్మ వ్యాధులు (Skin Infections)..

 అపరిశుభ్ర వాతావరణం, శుభ్రం చేయని పరికరాల వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ట్యాటూ వేసిన చోట విపరీతంగా ఎర్రబడటం, వాపు, నొప్పి, వేడిగా అనిపించడం, చీము పట్టడం లేదా జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

సిరాతో ఎలర్జీ (Ink Allergies)..

 కొందరికి ట్యాటూ కోసం వాడే రంగులు పడవు. దీనివల్ల చర్మంపై దద్దుర్లు రావడం, తీవ్రమైన దురద, మంట, వాపు వస్తాయి. కొన్నిసార్లు ట్యాటూ వేయించుకున్న నెలలు లేదా సంవత్సరాల తర్వాత కూడా ఈ ఎలర్జీలు బయటపడొచ్చు.

ట్యాటూ వేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

గుర్తింపు పొందిన స్టూడియో.. ట్యాటూ ఎల్లప్పుడూ మంచి గుర్తింపు ఉన్న, పరిశుభ్రమైన వాతావరణం కలిగిన స్టూడియోల్లోనే వేయించుకోవాలి.

కళ్లెదుటే కొత్త సూది..ట్యాటూ వేసే ఆర్టిస్ట్ మీ ముందే కొత్త, సింగిల్ యూజ్ (Disposable) సూది ప్యాకెట్‌ను ఓపెన్ చేసేలా చూసుకోండి. పాత సూదులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దు. స్టెరిలైజేషన్ తప్పనిసరి.. మళ్లీ వాడే వీలున్న పరికరాలను మెషీన్ గ్రిప్స్ లాంటివి సరిగ్గా స్టెరిలైజ్ చేశారో లేదో నిర్ధారించుకోండి. గ్లౌజులు, పరిశుభ్రత.. ట్యాటూ వేసే వ్యక్తి తప్పనిసరిగా కొత్త గ్లౌజులు ధరించాలి. అలాగే వారు పనిచేసే బల్ల కూడా శుభ్రంగా ఉండాలి.

వేయించుకున్న తర్వాత (Aftercare)..

ట్యాటూ వేయించుకున్న తర్వాత ఆర్టిస్ట్ సూచించిన యాంటీ-బ్యాక్టీరియల్ క్రీములు రాస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పదే పదే తాకవద్దు.. గాయం మానకముందే ట్యాటూ వేసిన ప్రదేశాన్ని చేతులతో పదే పదే తాకకూడదు. ఏదైనా ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా చర్మవ్యాధుల నిపుణుడిని కలవాలి. ఫ్యాషన్ కంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం. మీ సరదా ప్రాణాల మీదకు రాకుండా ఉండాలంటే ఆయా జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.