Magnesium : నీరసం, అలసటా..? మెగ్నీషియం లోపమేమో గమనించండి..!
సాక్షి లైఫ్ : రోజంతా పనిచేయకపోయినా విపరీతమైన అలసట వేధిస్తోందా..? కండరాలు పట్టేయడం, కాళ్ల తిమ్మిర్లు తరచూ ఇబ్బంది పెడుతున్నాయా? అయితే మీ శరీరానికి తగినంత ‘మెగ్నీషియం’ అందుతోందో లేదో సరిచూసుకోవాల్సిందే. సాధారణంగా పోషకాహారం అనగానే విటమిన్లు, ప్రొటీన్ల గురించే ఎక్కువ ఆలోచిస్తుంటాం. కానీ శరీర జీవక్రియలు సజావుగా సాగడానికి ఖనిజాల (Minerals) పాత్ర అత్యంత కీలకం. అందులోనూ మెగ్నీషియం అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
శరీరంలో మెగ్నీషియం పాత్ర ఏమిటి..?
శరీరంలో జరిగే 300కు పైగా జీవరసాయన చర్యల్లో మెగ్నీషియం పాలుపంచుకుంటుంది. నరాల ద్వారా సంకేతాలు చేరవేయడానికి, కండరాలు సరిగ్గా సంకోచ-వ్యాకోచాలు చెందడానికి ఇది తోడ్పడుతుంది. గుండె లయ తప్పకుండా కొట్టుకోవడంలోనూ, రక్తపోటు (BP) అదుపులో ఉండటంలోనూ మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం నుంచి శక్తి విడుదల కావడానికి, డీఎన్ఏ నిర్మాణానికి ఇది అవసరం. శరీరంలో ఉండే మెగ్నీషియంలో ఎక్కువ భాగం ఎముకల్లోనే నిల్వ ఉంటుంది.
లోపం తలెత్తితే కనిపించే లక్షణాలు..
శరీరంలో మెగ్నీషియం స్థాయులు తగ్గినప్పుడు మొదట్లో సాధారణ లక్షణాలే కనిపిస్తాయి. అయితే సమస్య తీవ్రమయ్యే కొద్దీ మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకలి మందగించడం, వికారం లేదా వాంతులు రావడం. తగినంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని నిస్సత్తువ, బలహీనత. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు లేదా సూదులతో గుచ్చినట్లు అనిపించడం. పిక్కలు, తొడ కండరాలు అకస్మాత్తుగా పట్టేయడం. సమస్య తీవ్రమైతే గుండె లయ తప్పడం (arrhythmia), ఫిట్స్ వంటి తీవ్ర సమస్యలకూ దారితీయవచ్చు.
ఈ లోపం వచ్చే ముప్పు ఎవరిలో ఎక్కువ..?
కొందరిలో ఆహారం సరిగ్గా తీసుకున్నా శోషణ లోపించడం వల్ల మెగ్నీషియం తగ్గే ప్రమాదం ఉంటుంది. జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు, టైప్-2 మధుమేహం బాధితులు,మద్యపానం ఎక్కువగా అలవాటు ఉన్నవారు. వృద్ధాప్యంలో ఉన్నవారు, కొన్ని రకాల మూత్రవిసర్జన పెంచే మందులు దీర్ఘకాలంగా వాడుతున్నవారు.
రోజువారీ అవసరం ఎంత..?
సాధారణంగా వయోజనులైన పురుషులకు రోజుకు 400 - 420 మిల్లీగ్రాములు, మహిళలకు 310 - 320 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది. శరీరంలో మెగ్నీషియం లోపాన్ని అధిగమించడానికి మార్కెట్లో దొరికే కృత్రిమ సప్లిమెంట్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో నిత్యం అందుబాటులో ఉండే సహజమైన పోషకా హారంతోనే ఈ లోపాన్ని చాలా సులభంగా భర్తీ చేసుకోవచ్చు.
ముఖ్యంగా గింజలు, డ్రైఫ్రూట్స్‌లో ఇది సమృద్ధిగా లభిస్తుంది. ఉదాహరణకు, కేవలం 28 గ్రాముల గుమ్మడి గింజల (Pumpkin seeds) నుంచే దాదాపు 156 మిల్లీగ్రాముల మెగ్నీషియం అందుతుంది. అలాగే అంతే పరిమాణంలోని చియా గింజల నుంచి సుమారు 111 మిల్లీగ్రాములు, బాదం పప్పుల ద్వారా దాదాపు 80 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం శరీరానికి లభిస్తుంది. వీటితో పాటు జీడిపప్పు, వేరుసెనగలు, ముడి ధాన్యాలు, పాలకూర వంటి ఆకుకూరలను రోజూ సమతుల్యంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన మెగ్నీషియం పూర్తి స్థాయిలో లభించి నీరసం, కండరాల నొప్పులు వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
