Heart Problem : హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్.. ఈ మూడూ ఒకటే అనుకుంటే పొరపాటే..!
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాల వల్ల వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు ముంచుకొస్తున్నాయి. చిన్న పిల్లలు, యువకులు సైతం గుండె సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. గుండె జబ్బుల ముందస్తు సంకేతాలను పసిగట్టాలన్న ఉద్దేశంతో జనాల్లో అవగాహన కల్పిస్తున్నారు వైద్యనిపుణులు. సాధారణంగా గుండె సంబంధిత సమస్యల గురించి మాట్లాడేట ప్పుడు.. హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్ అనే పదాలను తరచుగా వింటుంటాం. చాలామంది ఈ మూడూ ఒకటే అనుకుని పొరబడుతుంటారు. కానీ, వైద్యపరంగా ఇవి మూడు వేర్వేరు సమస్యలు. వీటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు, లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి.. World Heart Day 2026 : బ్లూ లైట్ తోనే యువతలో పెరుగుతున్న గుండెపోటు ముప్పు..!
1. హార్ట్ ఎటాక్ (Heart Attack - రక్త ప్రసరణలో సమస్య)..
ఇది ప్రధానంగా రక్త ప్రసరణకు సంబంధించిన సమస్య (Plumbing problem). గుండె కండరాలకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో (Coronary Arteries) కొవ్వు పేరుకుపోయి పూడికలు ఏర్పడతాయి. దీంతో రక్త ప్రసరణ నిలిచిపోయి గుండె కండరాలు దెబ్బతింటాయి. ఇది అకస్మాత్తుగా వచ్చేది కాదు.. ఎప్పటినుంచో పేరుకుపోయిన కొవ్వు వల్ల ఒక రోజు హార్ట్ ఎటాక్ వస్తుంది. లక్షణాలు..ఛాతీలో విపరీతమైన నొప్పి, బరువుగా అనిపించడం. ఈ నొప్పి ఎడమ చేయి, వీపు, మెడ, దవడ లేదా పొట్ట భాగాలకు వ్యాపించడం. చల్లటి చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, తలతిరగడం. చికిత్స.. ఎంత త్వరగా వైద్య సహాయం అందిస్తే, రోగి కండరాలు దెబ్బతినకుండా ప్రాణాలు దక్కే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
2. హార్ట్ ఫెయిల్యూర్ (Heart Failure)..
హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పనిచేయడం పూర్తిగా ఆగిపోవడం కాదు. శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని గుండె పంపింగ్ చేయలేకపోవడాన్ని (Pumping problem) 'హార్ట్ ఫెయిల్యూర్' అంటారు. దీర్ఘకాలికంగా ఉన్న అధిక రక్తపోటు (bp), గుండె కండరాలు బలహీనపడటం వల్ల ఈ పరిస్థితి అకస్మాత్తుగా కాకుండా నెమ్మదిగా దాపురిస్తుంది. లక్షణాలు..నడుస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు ఆయాసంగా, ఊపిరి ఆడనట్లుగా ఉండటం. కాళ్లు, చీలమండల వద్ద వాపులు రావడం, చిన్న పనులకే తీవ్రమైన అలసట రావడం.
3. కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest - విద్యుత్ వ్యవస్థలో లోపం)..
ఇది హార్ట్ ఎటాక్ కంటే భిన్నమైనది. గుండె విద్యుత్ వ్యవస్థలో తలెత్తే లోపం (Electrical problem) వల్ల ఇది సంభవిస్తుంది. గుండె లయ తప్పి, అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది. దీంతో శరీరానికి రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోతుంది. హార్ట్ ఎటాక్ కొన్నిసార్లు కార్డియాక్ అరెస్ట్‌కు దారితీయవచ్చు. లక్షణాలు.. రోగి అకస్మాత్తుగా కుప్పకూలి పోతాడు, స్పృహ కోల్పోతాడు. నాడి కొట్టుకోదు. చికిత్స.. ఇది అత్యంత ప్రమాదకరమైన అత్యవసర పరిస్థితి. అంబులెన్స్ వచ్చేలోపు రోగికి వెంటనే 'సీపీఆర్' (CPR) చేస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే..
హార్ట్ ఎటాక్.. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం. హార్ట్ ఫెయిల్యూర్.. గుండె తగినంత రక్తాన్ని పంపింగ్ చేయలేకపోవడం. కార్డియాక్ అరెస్ట్..గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోవడం. ఈ మూడింటిలో దేనికైనా ప్రతి సెకను ఎంతో విలువైందే. లక్షణాలను వెంటనే గుర్తించి ఆస్పత్రికి తరలిస్తేనే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
