Ignoring Ear Infections : చెవి ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తున్నారా..? ఐతే ఇవి తెలుసుకోండి..
సాక్షి లైఫ్ : కేవలం వినికిడికే కాకుండా.. మన శరీరం స్థిరంగా, సమతుల్యంగా (Balance) ఉండటానికి కూడా చెవులు ఎంతో కీలకం. అయితే, మారుతున్న జీవనశైలి, గంటల తరబడి ఇయర్‌ఫోన్లు వాడటం, చెవులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి కారణాల వల్ల ఈ మధ్యకాలంలో చెవి ఇన్ఫెక్షన్ల బారిన పడేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ సమస్యలను ప్రారంభంలోనే గుర్తించకపోతే వినికిడి లోపానికి దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు లేదా మీ పిల్లలకు చెవిలో ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఎలాంటి సంకేతాలు సహాయపడతాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
చెవి ఇన్ఫెక్షన్‌కు అత్యంత ప్రధాన లక్షణం నొప్పి. ఇది స్వల్పంగా మొదలై.. లోపల ద్రవం చేరే కొద్దీ సూదితో గుచ్చినట్లు తీవ్రంగా మారుతుంది. పడుకున్నప్పుడు ఈ ఒత్తిడి మరింత పెరిగి నొప్పి తీవ్రమవుతుంది.
చెవిలో నుంచి పసుపు లేదా తెలుపు రంగులో దుర్వాసనతో కూడిన ద్రవం/చీము కారుతుంటే అది ఇన్ఫెక్షన్‌కు స్పష్టమైన సంకేతం. కొన్నిసార్లు లోపల ఒత్తిడి ఎక్కువై చెవి పొర (Ear Drum) పగిలినప్పుడు కూడా ఇలా ద్రవం బయటకు వస్తుంది. ఆ సమయంలో నొప్పి తాత్కాలికంగా తగ్గినప్పటికీ, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
వినికిడి తగ్గడం లేదా చెవి మూసుకుపోవడం: మధ్య చెవిలో ద్రవం నిలిచిపోవడం వల్ల చెవి దిబ్బేసినట్లు (మూసుకుపోయినట్లు) అనిపిస్తుంది. మాటలు స్పష్టంగా వినపడవు.
ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొంతమందికి చెవిలో గింగురుమనే శబ్దం, ఈలలు లేదా రింగుమనే శబ్దాలు వినిపిస్తుంటాయి.
నొప్పితో పాటు జ్వరమా..?
బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ సోకినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలలో చెవి నొప్పితో పాటు 100°F (37.8°C) లేదా అంతకంటే ఎక్కువ జ్వరం వస్తే అది ఇన్ఫెక్షన్ తీవ్రతను సూచిస్తుంది.
పసిపిల్లల్లో ఎలా గుర్తించాలి..?
చిన్న పిల్లలు తమకు వస్తున్న ఇబ్బందిని నోటితో చెప్పలేరు. కాబట్టి తల్లిదండ్రులు వారి ప్రవర్తనను బట్టి గుర్తించాలి. పాలు తాగేటప్పుడు లేదా పడుకున్నప్పుడు నిరంతరాయంగా ఏడవడం. నిద్ర సరిగ్గా పట్టకపోవడం, అసౌకర్యంగా ఫీలవ్వడం. తరచూ చేతులతో చెవిని లాగడం లేదా రుద్దడం చేస్తుంటే వారికి చెవి నొప్పి ఉన్నట్లు అనుమానించాలి.
చాలామందికి జలుబు లేదా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు తగ్గిన వెంటనే చెవి నొప్పి మొదలవుతుంది. జలుబు చేసినప్పుడు ముక్కు, గొంతులోని ఇన్ఫెక్షన్ ఈస్టేచియన్ నాళం ద్వారా చెవికి పాకే అవకాశం ఎక్కువ.
ఇయర్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ను మితిమీరి వాడటం తగ్గించాలి. చెవిలో నొప్పి గానీ, ద్రవాలు కారడం గానీ గమనించినప్పుడు సొంత వైద్యం అస్సలు చేయకూడదు. వెంటనే ఇ.ఎన్.టి (ENT) నిపుణులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా శాశ్వత వినికిడి లోపం రాకుండా కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
