Eyes Warning Signs : మీ కళ్లల్లో ఈ మార్పులు కనిపిస్తే తీవ్రమైన వ్యాధులకు ముందస్తు హెచ్చరికలు కావచ్చు..!

షేర్ చేయండి:
Eyes Warning Signs : మీ కళ్లల్లో ఈ మార్పులు కనిపిస్తే తీవ్రమైన వ్యాధులకు ముందస్తు హెచ్చరికలు కావచ్చు..!

సాక్షి లైఫ్ : మన శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు, అది ఏదో ఒక రూపంలో ముందస్తు సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. ముఖ్యంగా, వైద్య నిపుణులు కళ్లను శరీరానికి అద్దంగా భావిస్తారు. కేవలం చూపును ప్రసాదించడమే కాకుండా.. గుండె, కాలేయం, మెదడు వంటి కీలక అవయవాల అంతర్గత స్థితిని కూడా కళ్లు ప్రతిబింబిస్తాయి. చాలామంది కళ్లలో వచ్చే చిన్నపాటి మార్పులను కేవలం కంటి సమస్యలుగానే భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, అవి శరీరంలో దాగి ఉన్న మధుమేహం, అధిక రక్తపోటు, కాలేయ వ్యాధులు, చివరికి పక్షవాతం వంటి తీవ్రమైన అనారోగ్యాలకు ముందస్తు హెచ్చరికలు కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్లలో కనిపించే ఎలాంటి మార్పులను అస్సలు తేలికగా తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

1. దృష్టి మసకబారుతోందా..?

చూపు మసకబారడం అనేది కేవలం కళ్లద్దాలు పడటానికి సంకేతం మాత్రమే కాకపోవచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పినప్పుడు, అది కంటిలోని లెన్స్‌పై ప్రభావం చూపి దృష్టి మసకబారేలా చేస్తుంది. దీర్ఘకాలం పాటు మధుమేహం నియంత్రణలో లేకపోతే, అది రెటీనాలోని రక్తనాళాలను దెబ్బతీసి ‘డయాబెటిక్ రెటినోపతి’కి దారితీస్తుంది. అధిక రక్తపోటు (bp) కారణంగా కూడా కంటిలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని చూపు మసకబారే ప్రమాదం ఉంది.

2. కళ్లు పసుపు రంగులోకి మారాయా..?

కళ్లలోని తెల్లసొన భాగం పసుపు రంగులోకి మారడాన్ని సాధారణంగా కామెర్లు (Jaundice) అంటారు. ఇది కంటికి సంబంధించిన వ్యాధి కాదు, నేరుగా కాలేయ (Liver) ఆరోగ్య సమస్యను సూచిస్తుంది. శరీరంలో పాత ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు ‘బిలిరుబిన్’ అనే పసుపు రంగు వ్యర్థ పదార్థం ఏర్పడుతుంది.

కాలేయం ఈ బిలిరుబిన్‌ను సరిగ్గా వడపోయనప్పుడు, అది రక్తంలో పేరుకుపోయి కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. ఫ్యాటీ లివర్, హెపటైటిస్, లివర్ సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధుల ప్రారంభ లక్షణాల్లో ఇది ప్రధానమైనది.

3. కళ్ల ముందు మచ్చలు తేలుతున్నట్లుగా ఉందా..?

కళ్ల ముందు చిన్న చిన్న నల్లటి మచ్చలు లేదా దారాల వంటి ఆకారాలు (Floaters) కదులుతున్నట్లు అనిపించడం వయసు పైబడిన వారిలో సహజమే. అయితే, చిన్న వయసులోనే ఈ సమస్య వస్తే మాత్రం దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది రెటీనాలో లోపాలను సూచిస్తుంది. మయోపియా ఉన్నవారికి, మధుమేహ బాధితులకు లేదా కంటికి గాయాలైన వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

4. కనుపాపల పరిమాణంలో తేడాలున్నాయా..?

రెండు కళ్లలోని కనుపాపల (Pupils) పరిమాణంలో అకస్మాత్తుగా వ్యత్యాసాలు రావడం నాడీ సంబంధిత (Neurological) సమస్యలకు సంకేతం కావచ్చు. మెదడులో రక్తస్రావం, పక్షవాతం (stroke), తలకు తీవ్రమైన గాయం లేదా మెదడులో కణితి (brain tumor) ఏర్పడినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. ఈ మార్పుతో పాటు తీవ్రమైన తలనొప్పి, ఒకే వస్తువు రెండుగా కనిపించడం (double vision), మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే తక్షణమే అత్యవసర వైద్య సహాయం పొందాలి.

5. కనురెప్పల చుట్టూ ఉబ్బినట్లు గడ్డలున్నాయా..?

కనురెప్పల పైన లేదా కంటి మూలల్లో మెత్తటి, పసుపు లేదా నారింజ రంగులో చిన్నపాటి కొవ్వు గడ్డలు (Xanthelasma) కనిపిస్తే, అది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగాయనడానికి స్పష్టమైన సంకేతం. ముఖ్యంగా 45 ఏళ్ల లోపు వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే, గుండె జబ్బుల ముప్పు పొంచి ఉన్నట్లేనని, వెంటనే కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముందస్తు నివారణే మార్గం..

కంటి చూపును, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 40 ఏళ్లు దాటిన వారు ఏటా కనీసం ఒక్కసారైనా సమగ్ర కంటి పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. దీనివల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా, శరీరంలో అంతర్గతంగా పొంచి ఉన్న ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స పొందే వీలుంటుంది.

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.